తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తిరుపతి ధర్మ పోరాట సభలో సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. అప్పుడు మోడీ ఏం చెప్పారో రికార్డు అయి ఉందని, వెంకన్న సాక్షిగా ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. 

సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదో రోజున ఇదే మైదానంలో మోడీ చేసిన హామీలను ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని మీరు చెప్పలేదా, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వరో చెప్పాలని ఆయన అన్నారు. 

ఎపికి అన్యాయం చేసిన బిజెపిని, ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం తాను మోడీపై పోరాటం చేస్తున్నానని, వీళ్లు మాత్రం మోడీపై ఈగ వాలనీయడం లేదని అన్నారు. తనపై ఒంటి కాలి మీద లేస్తున్నారని అన్నారు. వాళ్లకు సిగ్గు లేదని అన్నారు. 

ఎవ్వరకీ హోదాను ఇవ్వబోమని చెప్పి పది రాష్ట్రాలకు కొనసాగిస్తున్నారని అంటూ ఎపికి ఎందుకు ఇవ్వరని అడిగారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి నుంచి పాతిక మంది ఎంపీలను గెలిపిస్తే కాబోయే ప్రధానిని తెలుగువారే నిర్ణయిస్తారని చెప్పారు. 

సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేసుకుంటారా, స్కామాంధ్రగా చేసుకుంటారా అని తిరుపతి సభలో ప్రశ్నించిన మోడీ ఇప్పుడు అవినీతిపరులకు అండగా ఉంటున్నారని విమర్శించారు. అవినీతి సొమ్మును కక్కిస్తామని చెప్పిన ప్రధాని ఇప్పుడు రాజకీయాల కోసం వారి పంచన చేరుతున్నారని విమర్శించారు. ఇది కుట్ర రాజకీయం కాదా అని అడిగారు. 

మొన్నటి వరకు ఏమీ మాట్లాడని పవన్ కల్యాణ్ కూడా ఉన్నట్లుండి టిడిపిపై విరుచుకుపడుతున్నారని అన్నారు. మనం ధర్మ పోరాటం చేస్తుంటే వైసిపి విశాఖలో తనను తిట్టేందుకు మరో కార్యక్రమం పెట్టిందని ఆయన అన్నారు.