అమరావతి: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్‌ బిల్లును అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. 

రాజ్యసభలో తలాక్‌ బిల్లును అడ్డుకోవాలని ఇద్దర్నీ చంద్రబాబు కోరారు. ఉండవల్లిలో తన నివాసం నుంచి ఇరువురు నేతలకూ ఫోన్ చేసిన చంద్రబాబు ముస్లింలపై వేధింపులను అడ్డుకోవాలని, వారి హక్కులను కాపాడాలని కోరారు. బిల్లును అడ్డుకునేందుకు బీజేపీయేతర పక్షాల సభ్యులందరినీ ఏకం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

బీజేపీ ముస్లిం వ్యతిరేక చర్యలను గట్టిగా ప్రతిఘటించాలని ఇరువురు నేతలనూ కోరారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై పార్టీ ఎంపీలతో మాట్లాడిన సీఎం చంద్రబాబు తమ సభ్యులంతా హాజరయ్యేలా విప్ జారీ చేయాలని ఆదేశించారు.  

ఇకపోతే తలాక్ బిల్లు రాజ్యసభకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. ఒక్కో కులానికి ఒక్కో రూల్‌ తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రతి మతానికి సమానంగా ఉండాలన్నారు. లోక్‌సభలో దౌర్జన్యంగా ట్రిపుల్‌ తలాక్‌బిల్లును ఆమోదింపజేశారని, ముస్లింలకు అన్యాయం జరిగేలా ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.