విజయవాడ: తన శిష్యుడి తెలివితేటలు తనకు తెలియవా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై వ్యాఖ్యానించారు. తనకన్నా కేసీఆర్ గొప్పవాడని ప్రధాని మోడీ అంటున్నారని, తన శిష్యుడి తెలివితేటలు తనకు తెలియవా అని ఆయన అన్నారు. 

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పేదరికమే తన కులమని, పేదలే తన బంధువులని ఆయన అన్నారు. ఎన్టీఆర్ టీటీడీలో అన్నదానాన్ని ప్రవేశపెడితే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించానని ఆయన చెప్పుకున్నారు. 

గోద్రా అల్లర్లలో ప్రధాని మోడీని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన వారిలో తాను మొదటివాడినని అన్నారు. అది మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తే తాను బాధ్యుడిని కానని అన్నారు. వైసీపి ట్రాప్ లో టీడీపి పడిందన్న మోడీ మాటలను ఆయన ఖండించారు. మోడీనే అవినీతి ట్రాప్ లో పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
రాబోయే రెండు నెలల్లో కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు గట్టిగా పనిచేసి అభిమానుల సత్తా ఏమిటో చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదిశేషగిరిరావును ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని అన్నారు. ఆ తర్వాత 13 జిల్లాల నుంచి వచ్చిన కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులకు చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.