అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను సిఎం చేస్తారట అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ ముఖ్యమంత్రి కావడానికి సహకరిస్తామని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన ప్రకటనపై ఆయన శనివారం మీడియా సమావేశంలో ఆ విధంగా స్పందించారు. 

వైసిపి ఎంపీలు పోరాడాల్సిన సమయంలో పారిపోయారని ఆయన అన్నారు. ఎన్నికలు రావని తెలిసి ఎందుకు రాజీనామా చేశారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో పోరాటం చేయాల్సి వస్తుందని, దాన్ని తప్పించుకోవడానికి రాజీనామాలు చేశారని, త్యాగం చేశామని తప్పించుకోవడానికి అలా చేశారని ఆయన అన్నారు. 

నాటకం ఆడుతున్నారని, తప్పుడు రాజకీయాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు.  కాబట్టి బిజెపి, పవన్ కల్యాణ్, వైసిపి టీడీపిని లక్ష్యం చేసుకున్నట్లు ఆయన ఆరోపించారు. తమపై వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేస్తున్నారని, సమస్యలను ఎత్తి చూపడం లేదని ఆయన అన్నారు. 

అక్కడ వైసిపి ఎంపీలు రాజీనామాలు చేసి తప్పించుకుంటే, ఇక్కడి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై తాము రాజీలేని పోరాటం చేస్తుంటే తమపై బురద చల్లుతున్నారని ఆయన అన్నారు. అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని వైసిపి ప్రయత్నిస్తోందని ఆయన అననారు.  

ప్రజలు బాగుంటే కొందరు సహించలేరు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుకు అంచనాల ప్రకారం నిధులు ఇవ్వాలని, సమాచారం ఇవ్వాలంటే ఇస్తున్నామని, తాను ఢిల్లీకి వచ్చి సమాచారం ఇస్తామని ఆయన అన్నారు. గిరిజనులకు నష్టపరిహారం ఎందుకు చెల్లించరని అడిగారు. కావాలని బిజెపి తప్పుడు ప్రచారం చేసిందని, వైసిపి తప్పుడు ప్రచారం చేసిందని, పవన్ కల్యాణ్ కూడా ఆ బ్యాచ్ లో కలిశారు. 

గడ్కరీ అవినీతి లేని పోలవరం కావాలని కోరుకున్నాడని సాక్షిలో రాశారని ఆయన అన్నారు. ఎక్కడుంది అవినీతి అని అడిగారు. ప్రజల పట్ల వైసిపికి నిబద్ధత ఉందా అని అడిగారు. కేసుల మాఫీ కోసం రాయబారాలు చేసుకుంటున్నారని వైసిపి నేతలపై ధ్వజమెత్తారు. 

పోలవరం భూముల సేకరణలో నష్టపరిహారం చెల్లింపు విషయంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అసైన్డ్ భూమి లేదని, అసైన్డ్ భూములకు కూడా ఇవ్వాలని చట్టంలో ఉందని ఆయన అన్నారు. ఆరోపణలు చేసి గడ్కరీకి ఉప్పందించారని ఆయన రాష్ట్ర బిజెపి నేతలను ఉద్దేశించి అన్నారు. 

కేసుల నుంచి తప్పించకోవడానికి కాళ్లు పట్టుకునే స్థితికి వచ్చారని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు. పోలవరం ముందుకే వెళ్తుందని ఆయన అన్నారు. కేంద్రంతో సమస్యలు ఉంటే అభివృద్ధి, సంక్షేమం అగిందా అని అడిగారు. అది మన హక్కు, గత ప్రభుత్వం ఇచ్చిందని ఆయన అన్నారు. విభజన చట్టంలో పెట్టినదాన్ని ఇవ్వడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన అన్నారు. 

లోపల అవిశ్వాసం, బయట విశ్వాసం... వాళ్లు చేసిందేమిటి అని వైసిపి ఎంపీలను ఉద్దేశించి అన్నారు. న్యూసెన్స్ అయినా చేసేవారు, ఇప్పుడు దానికి కూడా అవకాశం లేదని ఆయన అన్నారు. 

అన్నీ ఇచ్చేశామని మాట్లాడుతున్నారని, ఇచ్చేస్తే సమస్య ఏమిటని ఆయన అన్నారు. దుగ్గిరాజపట్నం ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. దాన్ని ఇస్తారా, లేదా చెప్పాలని ఆయన అన్నారు. వాళ్లు అడుగుతున్నది వాన్ పిక్ సిటీ అని ఆయన అన్నారు. వాన్ పిక్ సిటీ వేరు, దుగ్గిరాజపట్నం వేరు అని ఆయన అన్నారు. ఫ్యాబ్ సిటీని ఫేక్ సిటీగా మార్చారని ఆయన అన్నారు.