చంద్రబాబును వెనకేసుకొచ్చిన అశోక్ బాబు: బిజెపి ఫైర్

Chandrababu behind Ashok Babu: BJP
Highlights

పిఎన్జీవోల సంఘం నాయకుడు అశోక్ బాబు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. అశోక్ బాబుపై బిజెపి నాయకులు మండిపడుతున్నారు.

అమరావతి: ఎపిఎన్జీవోల సంఘం నాయకుడు అశోక్ బాబు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. అశోక్ బాబుపై బిజెపి నాయకులు మండిపడుతున్నారు.  అశోక్ బాబుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బిజెపి నేత పృథ్వీరాజ్ చెప్పారు. చంద్రబాబును అశోక్ బాబు వెనకేసుకొస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓ ఉద్యోగి అయి ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సమంజసం కాదని పృథ్వీరాజ్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.  ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపికి తెలుగు ఓటర్లు ఓట్లు వేయవద్దని ఆయన ప్రచారం సాగించారు. 

ఉద్యోగ విధులు విస్మరించి రాజకీయం చేయడం అశోక్ బాబుకు తగదని బిజెపి నేత ఆంజనేయ రెడ్డి అన్నారు. అశోక్ బాబు కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేయడం వెనక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు.

అశోక్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అశోక్ బాబును ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై తెలుగుదేశం కొత్త డ్రామాను ప్రారంభించిందని, చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని అన్నారు. టిడిపి తెలుగు డ్రామా పార్టీగా మారిందని వ్యాఖ్యానించారు.

అశోక్ బాబు ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లి తెలుగు సంఘాల సమావేశం పేరిట ఓ వర్గం సమావేశం ఏర్పాటు చేశారనే విమర్శ ఉంది. బిజెపిని ఓడించాలని ఆయన చంద్రబాబు సందేశంగా తెలుగు సంఘాలకు చెందినవారికి చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై అశోక్ బాబు వివరణ ఇచ్చినప్పటికీ ఆ విరణ కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తనపై వచ్చిన విమర్శలకు అశోక్ బాబు వివరణ ఇచ్చారు. ఏ పార్టీకి తాను అనుకూలం కాదని ఆయన మంగళవారం అన్నారు. చంద్రబాబు పాలనకు ఇబ్బందులు వస్తాయని ఉద్యమాలు చేయడం లేదని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ పాలన బిజెపి, నాన్ బిజెపి అనే విధానంలో నడుస్తోందని అభిప్రాయపడ్డారు. టీడిపి తరఫున బెంగళూరుకు వెళ్లలేదని చెప్పారు. ఎపి హక్కుల కోసం ఎపి హక్కుల సాధన సమితి తరఫున 150 మందిమి అక్కడికి వెళ్లామని చెప్పారు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అశోక్ బాబు చెప్పారు. 

loader