ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్ర: అమరావతి రైతుల యాత్రపై జగన్ ఫైర్
రాష్ట్రంలో ప్రజల మద్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడ గెలవలేని పరిస్థితి నెలకొన్నందునే చంద్రబాబు అమరావతి యాత్రకు స్పాన్సర్ చేస్తున్నారన్నారు.
అమరావతి:రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే కుప్పం సహ అన్ని నియోజకవర్గాల్లో ఓటమి తప్పదని చంద్రబాబుకు భయం పట్టుకుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అందుకే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే అమరావతి రైతుల పాదయాత్రలో పెట్రోల్, డీజీల్ పోసి రెచ్చగొడుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. అమరావతి రైతుల ఉద్యమానికి చంద్రబాబునాయుడు స్పాన్సర్ చేస్తున్నారని జగన్ విమర్శించారు. బుద్ది ఉన్న వారెవరైనా ఈ పని చేస్తారా అని జగన్ ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఇంత నీచంగా వ్యవహరిస్తారా అని జగన ప్రశ్నించారు. చంద్రబాబబు దుష్టచతుష్టయం పోతే కానీ ప్రజలంతా సంతోషంగా ఉండరని సీఎం అభిప్రాయపడ్డారు.
ఏపీ అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. అమరావతి రైతులు ఇక్కడి నుండి పాదయాత్రగా ఉత్తరాంధ్రకు వెళ్లి అక్కడి దేవుళ్లను ప్రార్ధిస్తారో చెప్పాలన్నారు.
ఉత్తరాంధ్రలో అభివృద్ది వద్దు, అమరావతిలోనే అభివృద్ది ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తారా అని జగన్ ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్రను చూసి ఉత్తరాంధ్ర ప్రజలు నోరు మెదపకుండా ఉండాలా అని సీఎం జగన్ అడిగారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా భావోద్వేగాలు ఉండవా అని సీఎం జగన అడిగారు. ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు అమరావతి రైతులతో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరగాలని చంద్రబాబు కోరుకుంటున్నారన్నారు.
అన్ని ఆలోచించిన తర్వాతే పాలనా వికేంద్రీకరణను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ చెప్పారు. శ్రీబాగ్ ఒప్పందం నుండి బోస్టన్ గ్రూప్ నివేదిక వరకు ఇదే విషయాన్ని చెప్పిందని సీఎం జగన్ గుర్తు చేశారు. గ్రామ పరిపాలన నుండి రాస్ట్ర రాజధాని వరకు ఇదే తమ ప్రభుత్వ విధానం అని జగన్ తేల్చి చెప్పారు. ఇంటింటికి మనిషి మనిషికి మంచి చేయడమే లక్ష్యంగా పాలన చేస్తున్నట్టుగా జగన్ చెప్పారు.
2019 ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 అసెంబ్లీ స్థానాల్లోని 29 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు. మంచి పాలనను అందిస్తున్నందునే 2019 తర్వాత ప్రతి ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని సీఎం చెప్పారు.గుంటూరు,కృష్ణా జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందన్నారు.
also read:పాలనా వికేంద్రీకరణతో మంచి ఫలితాలు : ఏపీ అసెంబ్లీలో జగన్
ఎంపీటీసీ ఎన్నికల్లో 8298, టీడీపీ 960 స్థానాలు మాత్రమే దక్కించుకుందన్నారు. 637 ఎంపీపీ స్థానాల్లో వైసీపీ, 8 స్థానాల్లో టీడీపీ గెలిచిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 639 జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ గెలుపొందితే టీడీపీ 9 జడ్పీటీసీలను గెలుచుకుందన్నారు. వంద శాతం జడ్పీ చైర్మెన్ స్థానాలను గెలుచుకున్నట్టుగా జగన్ వివరించారు.