కేంద్రంపై పోరాటం తప్పదు..చంద్రబాబు సంచలనం

First Published 24, Feb 2018, 2:40 PM IST
Chandrababu asked leaders to fight against center for state development
Highlights
  • రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్ధితులపై సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేయకతప్పటం లేదని చంద్రబాబునాయుడు నేతలకు స్పష్టం చేశారు. శనివారం మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్ధితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఏపీ ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతలను ఆదేశించారు.

బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని సూచించారు. వాళ్ళు మనల్ని ఏమన్నా కానీ పట్టించుకోవద్దని కూడా చెప్పారు. ఏపీని ప్రత్యేకంగా చూస్తానన్న కేంద్రం తన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లే పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

అలాగే బీజేపీ కర్నూలు డిక్లరేషన్ అంశంపైనా చంద్రబాబు స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమను అభివృద్ధి చేశామన్నారు. తానూ రాయలసీమ బిడ్డే అన్న విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలన్నారు. కనీవినీ ఎరుగనిరీతిలో రాయలసీమకు నీళ్లందించామని చంద్రబాబు చెప్పారు.

రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలాడుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా అని నిలదీశారు. కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్‌, అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేస్తే బీజేపీ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి, నేతలు అనుసరించాల్సిన వైఖరిపై సమావేశంలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

 

loader