సెంట్రల్ జైల్లో చంద్రబాబు... బాలకృష్ణను పట్టుకుని బోరున విలపించిన మహిళ (వీడియో)
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో తీవ్ర మనస్తాపానికి గురయిన ఓ మహిళ బాలకృష్ణను పట్టుకుని బోరున విలపించింది.

అమరావతి : స్కిల్ డెవలమెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు భావోద్వేగానికి గురవుతున్నారు. తమ అభిమాన నాయకున్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం తట్టుకోలేక మనస్తాపంతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్న మహిళను టిడిపి ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఓదార్చారు.
చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాలు, ఇకముందు ఎలా వ్యవహరించాలన్నదానిపై చర్చించేందుకు టిడిపి నాయకులతో బాలకృష్ణ సమావేశమయ్యారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం కోసం వెళుతుండగా కొందరు మహిళలు ఆయనను కలిసారు. అందులో ఓ మహిళ బాలకృష్ణను పట్టుకుని బోరున విలపించింది. ఆమెకు ధైర్యం చెప్పిన ఆయన అంతిమంగా గెలిచేది న్యాయం, ధర్మమేనని అన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని... త్వరలోనే చంద్రబాబు జైలు నుండి బయటకు వస్తారని ధైర్యం చెప్పారు నందమూరి బాలకృష్ణ.
వీడియో
ఇక చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బాలకృష్ణ. అభివృద్ది, సంక్షేమానికి చంద్రబాబు బ్రాండ్ అని... ఆయన గురించి తెలుగు రాష్ట్రాలు, భారత్ లోనే కాదు ప్రపంచ దేశాలు కూడా చెప్పుకుంటాయని అన్నారు. అలాంటి నాయకుడికి అవినీతి మరకలు అంటించి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాజకీయ కక్షసాధింపు కోసమే చంద్రబాబును అరెస్ట్ చేయించారని బాలకృష్ణ ఆరోపించారు.
Read More ఎవరూ భయపడొద్దు, నేను వస్తున్నాను: ఇక బాలకృష్ణ పరామర్శ యాత్ర
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఓటమి ఖాయమని... ఇది గుర్తించిన వైఎస్ జగన్ ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని బాలకృష్ణ అన్నారు. ఓటమి భయంతోనే ఎలాంటి ఆధారాలు లేకపోయిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసారని అన్నారు. గతంలో అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ 16 నెలలు జైలులో ఉన్నారని... కనీసం 16 రోజులైన చంద్రబాబును జైలులో పెట్టాలని ఈ స్కామ్‌ను క్రియేట్ చేశారని బాలకృష్ణ ఆరోపించారు.