Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో టీడీపీ బంద్.. పలువురు నేతల గృహ నిర్బంధం, అరెస్ట్‌లు.. కొనసాగుతున్న 144 సెక్షన్..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ ఈరోజు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు జనసేన, సీపీఐతో పాటు పలు పక్షాలు మద్దతు తెలిపాయి.

Chandrababu Arrest TDP Protest Across over Bandh Call several leaders put in House Arrest ksm
Author
First Published Sep 11, 2023, 10:09 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ ఈరోజు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు జనసేన, సీపీఐతో పాటు పలు పక్షాలు మద్దతు తెలిపాయి. టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని  కొన్ని స్కూల్స్ నేడు సెలవు ప్రకటించాయి. కొన్నిచోట్ల స్వచ్చందంగా దుకాణాలను మూసివేశారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. విశాఖపట్నం చినవాల్తేరులో అచ్చెన్నాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాలలో టీడీపీ నేత ఫరూక్, కర్నూలు జిల్లా పత్తికొండలో కేఈ శ్యాంబాబు, కర్నూలులో కోట్ల  సూర్యప్రకాష్ రెడ్డి, ఇచ్చాపురంలో ఎమ్మెల్యే అశోక్, అనకాపల్లిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, గుడివాడలో రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము, తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ, సత్యసాయి జిల్లా వెంకటాపురంలో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్.. లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

ఇక, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాల్లో బస్సులను నిలిపివేసేందుకు రోడ్లను దిగ్బంధించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరసన తెలిపారు. అయితే గద్దె రామ్మోహన్ ను అరెస్ట్ చేసే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

తాడేపల్లిలో టీడీపీ శ్రేణులు నాయకులు ఆందోళన చేపట్టారు. తొలిత పట్టణంలోని పలు పాఠశాలలను, దుఖాణాలను ముసివేయాలని డిమాండ్ చేశారు. ఉండవల్లి సెంటర్ లో వాహానాలు అడ్డుకుని ప్రభుత్వంకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక, పలుచోట్ల టీడీపీ శ్రేణులతో పాటు జనసైనికులు కూడా నిరసనకు దిగుతున్నారు. 

ఇక, సీఐడీ లేని స్కామ్‌ను సృష్టిస్తోందని.. అందులో చంద్రబాబును ఇరికించేందుకు ప్రయత్నిస్తుందని టీడీపీ ఆరోపించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును ఇప్పటికే అమలు చేసిన గుజరాత్‌ మోడల్‌లో అమలు చేశామని టీడీపీ అధికార ప్రతినిధి ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఈ కార్యక్రమం కింద 2,13,000 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, వారిలో 75,000 మందికి ఉద్యోగ నియామకాలు లభించాయని తెలిపారు. టీడీపీ బంద్‌కు జనసేన మద్దతు తెలిపింది. చంద్రబాబుకు సంఘీభావంగా నిరసనల్లో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios