సారాంశం

తన తండ్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారంటూ దేశ రాజధాని డిల్లీ వేదికగా నిరసనకు దిగిన నారా లోకేష్ కు పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. 

న్యూడిల్లీ : ఏపీ మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై జాతీయ పార్టీలు స్పందిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల వేళ దేశ రాజధాని డిల్లీ వేదికగా నిరసనలు తెలుపుతూ తన తండ్రి అరెస్ట్ విషయాన్ని జాతీయ పార్టీల దృష్టికి తీసుకువస్తున్నారు నారా లోకేష్. దీంతో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టిడిపికి పలు పార్టీల మద్దతు లభిస్తోంది. ఇలా బిఎస్పితో పాటు హర్యానాకు చెందిన జననాయక్ జనతా పార్టీలు టిడిపికి మద్దతు తెలిపాయి. 

ప్రస్తుతం డిల్లీలో వున్న నారా లోకేష్ ను హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా పరామర్శించారు. అలాగే బహుజన్ సమాజ్ వాది పార్టీ ఎంపీలు కున్వార్ డ్యానిష్ ఆలీ, రితేష్ పాండే కూడా లోకేష్ ను కలిసి పరామర్శించారు. చంద్రబాబు కోసం టిడిపి చేపట్టిన న్యాయపోరాటానికి తమ మద్దతు వుంటుందని లోకేష్ ను కలిసిన నాయకులు తెలిపారు. 

వీడియో

చంద్రబాబు అరెస్ట్ కు కారణమైన స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం గురించి తనను కలిసిన నాయకులకు లోకేష్ వివరించారు. అంతేకాదు ఏపీలో వైసిపి పాలన, సీఎం జగన్ అరాచకాల గురించి కూడా తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవాలతో టిడిపి రూపొందించిన బుక్ లెట్ ని వారికి అందజేసారు లోకేష్. 

Read More  అసెంబ్లీలోనూ చంద్రబాబు అరెస్ట్ పై పోరాటం... టిడిఎల్పి కీలక నిర్ణయం

ఇదిలావుంటే చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టిడిపి ఎంపీలతో కలిసి ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు లోకేష్. గత సోమవారం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద లోకేష్, టిడిపి ఎంపీలు నిరసనకు దిగారు. ఇక మంగళవారం నారా లోకేష్ టీడీపీ నేతలతో కలిసి ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద నిరసనకు దిగారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించిన టీడీపీ  నేతలు..  నల్ల బ్యాడ్జీలు ధరించి అక్కడే మౌన దీక్ష చేపట్టారు. 

టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ లతో పాటు పార్టీ నేతలు గంటా శ్రీనివాసరావు, మురళీమోహన్, కాల్వ శ్రీనివాసు, కొనకళ్ల నారాయణ తదితర నేతలు పాల్గొన్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా అక్కడి నిరసనలో పాల్గొన్నారు.