Janasena: చంద్రబాబు చేతిలో పవన్ మోసపోయాడా? వెల్లువెత్తుతున్న జనసైనికుల ఆగ్రహం
టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రకటన వెలువడ్డ తర్వాత పవన్ అభిమానులు, జనసైనికుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఇంత తక్కువ సీట్లు కేటాయిస్తారా? వాటిని పవన్ కళ్యాణ్ ఎలా అంగీకరించాడా? అనే అసహనం వచ్చింది. తక్కువ సీట్లే కాదు.. బలహీన నియోజకవర్గాలను జనసేనకు కేటాయించారని వారు మండిపడుతున్నారు.
Chandrababu: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల పార్టీల మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కూటమిని ప్రకటించాయి. సీట్ల పంపకాలపైనా అవగాహనకు వచ్చాయి. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, మూడు పార్లమెంటు సీట్లను టీడీపీ కేటాయించింది. టీడీపీ పలువురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత జనసైనికుల్లో కలవరం మొదలైంది.
కొందరు ఈ సీట్ల పంపకాన్ని స్వాగతిస్తే మరికొందరు మాత్రం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు చాలా తక్కువ సీట్లను కేటాయించారని, ఇది అవమానకరం అని వాదిస్తున్నారు. దీనికితోడు మరో వాదన కూడా ఇప్పుడు తెర మీదికి వచ్చింది. జనసేన పార్టీకి బలహీనంగా ఉన్న సీట్లను టీడీపీ కేటాయించిందని వాదిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను నాదెండ్ల మనోహర్ మోసం చేశాడా? లేక చంద్రబాబు మోసపుచ్చాడా? అనే వాదనలు చేస్తున్నారు.
చంద్రబాబు కేటాయించిన సీట్లను పవన్ కళ్యాణ్ పరిశీలించలేదా? గుడ్డిగా నాదెండ్ల మనోహర్‌పై నమ్మకంతో ఓకే చేశాడా? అనే చర్చ జరుగుతున్నది. ఇక నాదెండ్ల మనోహర్ కూడా ఆ సీట్లను పరిశీలించాడా? లేక టీడీపీతో సఖ్యతను పెంచుకుని కావాలనే అలక్ష్యపెట్టాడా? అనే ఆరోపణలను జనసైనికుల నుంచి వస్తున్నాయి.
జనసేన పార్టీ గత ఎన్నికల్లో బలహీన ప్రదర్శన కనబరిచిన సీట్లను టీడీపీ కట్టబెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. అనకాపల్లిలో జనసేనకు కేవలం 11,988 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అక్కడి నుంచి రామకృష్ణను పవన్ కళ్యాణ్ బరిలోకి దించుతున్నారు. అది బహుశా అనకాపల్లి ఎంపీ సీటులో నాగబాబు పోటీకి దన్నుగా ఉంటుందని భావించారేమో అనే వాదనలూ ఉన్నాయి.
ఇక గన్నవరం సీటులో జనసేన 36,759 ఓట్లు సాధించుకోగా.. ఆ సీటును మాత్రం టీడీపీ తనకే అట్టిపెట్టుకుంది. పైగా జనసేనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మహసేన రాజేశ్‌కు టీడీపీ టికెట్ ఇచ్చింది. అలాగే.. విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, రాజమండ్రి రూరల్ వంటి జనసేనకు కొంత బలమున్న సీట్లలో టీడీపీ పోటీ చేస్తున్నది. అంతేకాదు, జనసేనకు బలమున్న కొత్తపేట్, మండపేట్, ముమ్మిడివరం, పాలకొల్లు వంటి సీట్లలో టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తిలోకి జనసైనికులు వెళ్లితే.. ఆ పార్టీ ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయా? అనే అనుమానాలూ రేకెత్తిస్తున్నాయి.