చంద్రబాబు..డిజిటల్ ట్రాన్సాక్షన్స్

chandrababu
Highlights

సమస్యలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి ప్రజలకు కొన్ని చిట్కాలు చెప్పారు.

‘దాహమేస్తోంటే బావి తవ్వు’ అన్నాడట వెనకటికి ఒకడు. అదే విధంగా ఉంది చంద్రబాబునాయడు చెబుతున్నది. గడచిన ఐదు రోజులుగా ప్రజలు నిత్యావసరాలు కోసం ‘చిల్లరో రామచంద్రా’ అని అల్లాడుతుంటే సమస్యలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి ప్రజలకు కొన్ని చిట్కాలు చెప్పారు. అవేమిటంటే, ప్రజలందరూ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ మొదలుపెట్టాలట. అదే విధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలట. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉపయోగించాలన్నారు. ఈ విధంగా చేస్తే సమస్యలను ఎదుర్కోవచ్చన్నారు.

 పనిలో పనిగా రిజర్వ్ బ్యాంకు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. జిల్లాలోని కొన్ని బ్యాంకుల్లో ఇపుడు నగదు నిల్వలు ఎక్కువగాను, కొన్ని బ్యాంకుల్లో అసలు లేవట. దాన్ని సర్దుబాటు చేయటానికి వీలుగా రిజర్వ్ బ్యాంకు నేరుగా బ్యాంకులకు నగదును పంపకుండా ప్రతీ జిల్లాలోను ఒక చెస్ట్ (ఖజానా)కు పంపితే అక్కడ నుండి అవసరమైన బ్యాంకులకు, బ్రాంచీలకు నగదు బట్వాడా చేయాలని ప్రతిపాదించారు.

  తాజాగా రాష్ట్రానికి వచ్చిన 6500 కోట్ల రూపాయల నగదులో ఎక్కువ భాగం అంటే సుమారు 4 వేల కోట్ల మేరకు 2 వేల రూపాయల నోట్లే వచ్చాయన్నారు. 500 రూపాయల నోట్లు ఎప్పుడు వచ్చేది తెలియదని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా పాత వెయ్యి, 500 రూపాయల నోట్లను తీసుకోవాల్సిందిగా ఆయా యాజమాన్యాలను కోరారు.

   పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు, చౌకధరల దుకాణాలు, ఆసుపత్రులు, గ్యాస్ సిలిండర్ అవసరమైన వాళ్ళు, కిరాణాకొట్లు తదితరాల వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. నోట్ల రద్దు, చిన్న నోట్ల కొరత వల్ల ఏర్పడుతున్న సమస్యలను తాను సమీక్షిస్తున్నట్లు కూడా చంద్రబాబు చెప్పారు.

 

loader