Asianet News TeluguAsianet News Telugu

ఏడవ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు

విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ సాధించిన ప్రగతి, ఎదుర్కొన్న కష్టాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే.

chandrababau naidu released 7th white paper
Author
Amaravathi, First Published Dec 29, 2018, 9:54 AM IST

విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ సాధించిన ప్రగతి, ఎదుర్కొన్న కష్టాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆయన 7వ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఇంధనం, మౌలిక రంగాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెంచలేని సీఎం స్పష్టం చేశారు. నెలకు 100 యూనిట్ల చొప్పున 18 లక్షల వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ఉచిత విద్యుత్ అందించామన్నారు. దోబీ ఘాట్స్, హార్టీకల్చర్, నర్సరీలకు ఫ్రీ కరెంట్ ఇచ్చామని అలాగే..  అక్వా కల్చర్, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఫౌల్టీ, హేచరీస్‌కు ధరల్లో మినహాయింపు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

2018-19 సంవత్సరానికి గాను రూ.6,030 కోట్ల రూపాయలను విద్యుత్ రంగంలో సబ్సిడీ ఇస్తున్నామన్నారు. నాలుగు సోలార్ పవర్ పార్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అమలు చేసిన సంస్కరణల కారణంగా యూనిట్ రూ. 6.50 పైసలుగా ఉన్న సోలార్ పవర్ ధర రూ. 2.70 పైసలకు దిగి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. 31,725 సోలార్ పంప్స్‌ను ఏర్పాటు చేశామని, 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఫ్లాంట్ కమిషనింగ్ అయ్యిందని తెలిపారు. రూ.36, 604 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు వచ్చాయని, 13 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.

 6 లక్షల 23 వేల బల్బులను పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, 20 లక్షల బల్బులు గ్రామపంచాయితీల్లో ఏర్పాటు చేశామన్నారు. 44, 514 నాన్ ఐఎస్ఐ పంపులను ఐఎస్ఐ పంపులుగా మార్చినట్లు బాబు అన్నారు. ఇంధన రంగంలో ఏపీకి 138 అవార్డులు వచ్చాయన్నారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో తొలి తరం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని.. విభజన తర్వాత ఇంధన రంగంపై దృష్టి పెట్టానని చంద్రబాబు తెలిపారు.

2014 జూన్ నాటికి రోజుకు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదన్నారు. ఫైబర్ గ్రిడ్ పథకం అద్భుతమైనదని కేవలం రూ.149కే 50 ఎంబీపీఎస్ స్పీడుతో నెట్ కనెక్షన్, టెలివిజన్, ల్యాండ్ లైన్ కనెక్షన్ అందజేస్తున్నట్లు సీఎం తెలిపారు. త్వరోల టవర్ కార్పోరేషన్ పూర్తవుతుందని దీని వల్ల రాష్ట్రంలో ఎక్కడా బ్యాండ్ విడ్త్ ఫ్రిక్వెన్సీ సమస్యలు రావని అన్నారు. వర్చువల్, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సీసీకెమెరాల ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు.

అమరావతి నిర్మాణం ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నగరంలో కాలుష్యానికి తావు లేదని.. ప్రతి వాహనం ఎలక్ట్రిక్ వాహనమేనని బాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులను ఆకలింపు చేసుకుంటూ వాటిని అమరావతి నిర్మాణంలో ఉపయోగిస్తామన్నారు.

రాజధాని ఫేజ్-1 ప్రాజెక్ట్ కింద రూ. 51,000 కోట్లు , ఫేజ్-2కి మరో రూ.51,000 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. తాను విభజన జరిగిన తర్వాతి రోజే రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు అవుతుందని చెప్పానని చంద్రబాబు గుర్తు చేశారు. 77 శాతం పనులను మంజూరు చేశామని, 1375 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నామని, వీటిలో అసెంబ్లీ,  హైకోర్టు, సెక్రటేరియేట్‌లు నిర్మితమవుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు.

అమరావతిని 9 నగరాలు , 27 టౌన్‌షిప్‌లు విభజించామన్నారు. విట్, ఎస్ఆర్ఎం, అమృత్ యూనివర్సిటీలు, 8 జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలు, ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, ఎయిమ్స్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, 8 స్టార్ హోటళ్లు, కన్‌వెన్షన్ సెంటర్ తో పాటు మరికొన్ని అమరావతికి తరలివచ్చాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అమరావతి నుంచి అనంతపురానికి గ్రీన్‌ఫిల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకి అనుమతులు వచ్చాయని, దీనికి సంబంధించిన స్థల సేకరణ జరుగుతోందన్నారు. 2,164 కిలోమీటర్లు ఆర్‌ అండ్ బీ రోడ్లు అప్‌గ్రేడ్ చేశామన్నారు. 11 జాతీయ రహదారులుగా మార్చేందుకు ఎన్‌హెచ్ఐఏతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు
 

Follow Us:
Download App:
  • android
  • ios