విశాఖపట్నం: శుక్రవారం ఛలో అంతర్వేదికి ఆంధ్ర ప్రదేశ్ బిజెపి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నం నుంచి కాకినాడ బయలుదేరి వెళ్లారు. అయితే ప్రస్తుతం అతడి వ్యక్తిగత మొబైల్ పనిచేయడం లేదు. దీంతో అతడి  కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

శుక్రవారం చలో అంతర్వేది నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నం నుంచి కాకినాడ బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో సాయంత్రం నుంచి ఆయన ఫోన్ స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. 

ఎక్కడైనా అదుపులోకి తీసుకున్నారా? అంటూ కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా పోలీసులను ఆరా తీశారు. కానీ పోలీసుల నుండి ఎలాంటి సమాచారం  లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

read more  ఛలో అమలాపురంకు బిజెపి పిలుపు... సోము వీర్రాజు హౌస్ అరెస్ట్ (వీడియో)

మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును విజయవాడలో పోలీసులు నిర్బంధించారు.  ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున ముందస్తు నిర్బంధం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

అటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంతర్వేది పర్యటనకు బయల్దేరడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై వీర్రాజు మండిపడ్డారు.

దాడులకు గురైన ఆలయాల సందర్శనకు వెళ్లిన యువకులపై కేసులు పెట్టడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆగడాలను నిరసిస్తూ రేపు ఛలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని చెప్పారు.