కాకినాడ: వైసీపీ కి రాజీనామా చేసిన చలమశెట్టి సునీల్‌‌కు టీడీపీ, జనసేనలు ఆసక్తి చూపుతున్నాయి.అయితే సునీల్  ఏ పార్టీలో చేరుతారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీలో చేరేందుకు సిద్దమై కొన్ని రోజులు సునీల్  వెనుకడుగు వేశారు. 

కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి  సునీల్  రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో  సునీల్ వైసీపీ నుండి  పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అతి తక్కువ ఓట్ల మెజారిటీతో సునీల్ ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో  కూడ పీఆర్పీ తరపున సునీల్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

నాలుగు మాసాల క్రితం సునీల్  వైసీపీకి గుడ్‌బై చెప్పారు. అయితే టీడీపీలో చేరాలని సునీల్ భావించారని ఆయన సన్నిహితవర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును కూడ సునీల్ కలిశారు.  టీడీపీలో చేరాలని సునీల్ ఆ సమయంలో నిర్ణయం తీసుకొన్నారు. కానీ, కారణాలు ఏమిటో తెలియదు కానీ కొంత కాలం వేచి చూడాలని సునీల్ భావించారు.

దీంతో  టీడీపీ చేరడం వాయిదా వేసుకొన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను  సునీల్  కలిశారు. జనసేనలో సునీల్ చేరే అవకాశం ఉందా అనే చర్చ కూడ తెరతీశారు.సునీల్ కు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బంధుత్వాలు కూడ ఉన్నాయి. వ్యాపార సంబంధమైన పరిచయాలు కూడ సునీల్ కు కలిసివచ్చే అవకాశం ఉందని ఆయా పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

2019 ఎన్నికల్లో  సునీల్ కాకినాడ  పార్లమెంట్ సెగ్మెంట్ నుండి  బలమైన అభ్యర్థి అవుతాడని  పార్టీలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో  టీడీపీ నేతలు సునీల్ తో మరోసారి టచ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.మరోవైపు సునీల్‌పై ఆయన సన్నిహితులు జనసేనలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. సునీల్ ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జనవరిలో  ఈ విషయమై సునీల్  తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశం లేకపోలేదని  ఆయన సన్నిహితులు చెబుతున్నారు.