Asianet News TeluguAsianet News Telugu

జగన్ మంత్రాంగ ఫలితం: ఎపికి కేంద్రం తీపి కబురు

సెక్రటేరియట్ లో అడుగుపెట్టిన తర్వాత జగన్ పెట్టిన తొలి మూడు సంతకాలలో ఒకటి అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం సాధనపై ఆయన సంతకం చేశారు. సంతకం చేసిన మూడు రోజులలోపే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలపడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
 

Centre gives green signal to express high way
Author
Amaravathi, First Published Jun 10, 2019, 6:08 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీపి కబురు చెప్పింది కేంద్రప్రభుత్వం. అనంతపురం నుంచి అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. దీంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా సెక్రటేరియట్ లో ఈనెల 8న అడుగుపెట్టారు. 

సెక్రటేరియట్ లో అడుగుపెట్టిన తర్వాత జగన్ పెట్టిన తొలి మూడు సంతకాలలో ఒకటి అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం సాధనపై ఆయన సంతకం చేశారు. సంతకం చేసిన మూడు రోజులలోపే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలపడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన ఎక్స్ ప్రెస్ హైవేకి అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేసిన కేంద్రం ఆ ప్రాజెక్టును రూ.27,300కోట్లతో  చేపట్టనున్నట్లు కూడా స్పష్టం చేశారు. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను కలుపుతూ సుమారు 600 కిలోమీటర్ల మేర 6/4 లైన్స్ తో నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ హైవే ప్రత్యేకత 120కిమీ వేగం కలిగిన రహదారిగా నిర్మించడం విశేషం. 

దేశ‌వ్యాప్తంగా జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి రూ.ల‌క్షా 20 వేల కోట్లు అవసరమని అందుకు సహకరించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.  

జూలై 5న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, వాటిని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులపై నిర్మలా సీతారామన్ తో నితిన్ గడ్కరీ చర్చించారు. 

అందులో అనంత‌పురం-అమ‌రావ‌తి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్ర‌తిపాద‌న‌ల‌ను కూడా పొందుప‌రిచారు. అనంతపురం- అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి రూ.30వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయగా తొలివిడతగా రూ.27,300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.  

కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న నేపథ్యంలో కేంద్రబ‌డ్జెట్ నుంచి ఈ నిధులు నేరుగా రాష్ట్రానికి మంజూరు చేయవచ్చునని తెలుస్తోంది. కేంద్రం ఆమోదముద్ర వేయడంతో ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి మార్గాలను రూపొందించడంపై కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.  

మెుత్తం అయిదు మార్గాలను అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంత‌పురం జిల్లా మారూరు నుంచి మెుదలయ్యే ఈ హైవే మొద‌టి మార్గం తాడిప‌త్రి, గిద్ద‌లూరు, కంభం, ప్ర‌త్తిపాడు, స‌త్తెన‌ప‌ల్లి మీదుగా విజ‌య‌వాడ ఇన్న‌ర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తుంది. 

రెండో ఆప్ష‌న్‌గా అనంత‌పురం, తాడిప‌త్రి, ఉయ్యాల‌వాడ‌, రుద్ర‌వ‌రం, గిద్ద‌లూరు, బెస్త‌వారి పేట‌గా నిర్ధారించారు. చిత్తూరు మిన‌హాయించి మూడో మార్గంగా అనంత‌పురం స‌మీపంలోని మామిళ్ల‌ప‌ల్లి నుంచి ఆరంభం అయ్యే ఎక్స్‌ప్రెస్ వే.. రైల్వే కొండాపురం, ముద్ద‌నూరు, య‌ర్ర‌గుంట్ల‌, క‌మ‌లాపురం, మైదుకూరు, వ‌నిపెంట‌, క‌నిగిరి, ద‌ర్శి, కావూరు, ఫిరంగిపురం మీదుగా శాఖ‌మూరు వ‌ద్ద ముగుస్తుంది. 

ఇకఫైనల్ ఆప్షన్ గా అనంత‌పురం, నార్ప‌ల‌, య‌ర్ర‌గుంట్ల‌, వ‌నిపెంట‌, పోరుమామిళ్ల‌, తాటిచెర్ల‌, బెస్త‌వారి పేట‌, ద‌ర్శి, కొమ్మాల‌పాడు, కావూరు, ఫిరంగిపురం, సిరిపురంగా నిర్ణ‌యించారు. ఈ ఐదు ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచనుంది ఏపీ ప్రభుత్వం.  

ఇకపోతే ఈ ఐదు ఆప్షన్లలో చిత్తూరు జిల్లాను మినహాయించడం విశేషం. అనంత‌పురం-అమ‌రావ‌తి ఎక్స్ ప్రెస్ హైవేకు 544 ఎఫ్ గా గుర్తింపు ఇచ్చింది కేంద్రప్రభుత్వం. గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ ప్రెస్ హైవేగా నిర్మిస్తున్న ఈ రహదారికి జాతీయ హోదా ప్రకటించింంది.  

అయితే ఈ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న వాటాగా 30 శాతం ఖ‌ర్చును భ‌రించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రంపెట్టిన కండీషన్ కు ఏపీ సీఎం జగన్ అంగీకారం తెలిపారని తెలుస్తోంది. మెుత్తానికి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు కాకముందే కీలక ప్రాజెక్టును సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios