చంద్రబాబుకు కేంద్రం భారీ షాక్

First Published 30, Nov 2017, 7:48 AM IST
Centre gives a jolt to naidu over polavaram project
Highlights
  • పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రప్రభుత్వం చంద్రబాబునాయుడుకు భారీ షాక్ ఇచ్చింది.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రప్రభుత్వం చంద్రబాబునాయుడుకు భారీ షాక్ ఇచ్చింది. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం పిలిచిన స్పిల్ వే, స్పిల్ వే ఛానల్ టెండర్లను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. కేంద్ర జలవనరుల శాఖ (సిడబ్ల్యుసి) నుండి ఈనెల 27వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చింది. హైడ్రో పవర్ కార్పొరేషన్ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేంత వరకూ ఎటువంటి పనులు చేపట్టవద్దంటూ సిడబ్ల్యుసి నుండి స్పష్టమైన ఆదేశాలు రావటం రాష్ట్రప్రభుత్వానికి నిజంగా పెద్ద షాకే.

మొదటి నుండి ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను కేంద్రం మంజూరు చేయటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఏదో ఒక  కొర్రీ వేస్తూ నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. దానికి తగ్గట్లే రాష్ట్రం కూడా కేంద్రం విడుదల చేసిన నిధులకు సక్రమంగా లెక్కలూ చెప్పటం లేదు. పైగా కేంద్రం అనుమతులు లేకుండా ఏకపక్షంగా ప్రాజెక్టు అంచనాల వ్యయాన్ని పెంచుకుంటూ పోతోంది. అదే సమయంలో ప్రాజెక్టు ప్రదాన కాంట్రాక్టు సంస్ధ ట్రాన్ స్ట్రాయ్ కూడా పనులు చేయటంలో నత్తకే నడకలు నేర్పిస్తోంది. దాంతో పనులు అనుకున్నదానికన్నా చాలా మెల్లిగా జరుగుతోంది.

కాంట్రాక్టు సంస్ధను మార్చి వచ్చే ఎన్నికల్లోగా పనులు పూర్తి చేయాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించలేదు. అయితే, సొంత నిర్ణయంతోనే ముందుకు వెళ్ళాలని నిర్ణయించిన చంద్రబాబు తనంతటా తానుగా స్పిల్ వే, స్పిల్ వే ఛానల్ కు టెండర్లు పిలిచారు. ఆ టెండర్లనే ఇపుడు కేంద్రం నిలిపేయమని ఆదేశించింది. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.

ఇదిలావుండగా, పోలవరం పనులను ఎక్కడిదక్కడ నిలిపేయాలంటూ ఒడిష్షా ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాయటం కలకలం రేపుతోంది. ఒడిష్షా ప్రధానికి లేఖ రాయటం, వెంటనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటం చూస్తుంటే తెరవెనుక ఏదో పెద్ద ప్లానే జరుగుతోందని అనుమానాలు మొదలయ్యాయి. అసలు కేంద్రమే నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు బలవంతంగా తన చేతుల్లోకి లాక్కోవటమే కారణంగా పలువురు భావిస్తున్నారు. రాజధానీ లేక, పోలవరమూ పూర్తి కాక మరి 40 ఇయర్స్ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో జనాలను ఏమని ఓట్లడుగుతారో ?

loader