వివాదాల పుట్ట: ఎవరీ కత్తి మహేష్?

Centre for controversies: Who is Mahesh Kathi?
Highlights

మహేష్ కత్తి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. పవన్ కల్యాణ్ సినిమా, రాజకీయ, వ్యక్తిగత జీవితాలపై ఆయన విమర్శలు చేసి దుమారం రేపారు. పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు మరో వివాదానికి పునాది వేశారు.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో తెగ పోరాడిన మహేష్ కత్తి తాజాగా శ్రీరాముడిపై వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారమే రేపారు. దీంతో ఆయనను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు నుంచి బహిష్కరించింది. అవసరమైతే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బహిష్కరిస్తామని డిజిపి మహేందర్ రెడ్డి చెప్పారు.

కత్తి మహేష్ సినీ విమర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు బాస్ 1లో పాల్గొనడం ద్వారా ఆయనకు మరింత పేరు వచ్చింది. ఆయన నటుడు కూడా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి ఫిలిం థియరీ లో పట్టభద్రుడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామం.

2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఎడారి వర్షం అనే కథను ఆధారం చేసుకుని ఊరు చివర ఇల్లు అనే లఘు చిత్రం తీశారు.. మిణుగురులు అనే చిత్రానికి సహ-రచయితగా వ్యవహరించారు. పెసరట్టు సినిమాను క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన హృదయ కాలేయంలో ఓ చిన్న పాత్ర పోషించారు.

పలు ప్రసార మాధ్యమాలలో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ మహేష్ దుమారం రేపారు. పవన్ కల్యాణ్ పై, ఆయన అభిమానులపై విమర్శనాస్త్రాలను సంధించడానికి ఫేస్ బుక్ ను, ట్విట్టర్ ను వేదికలుగా మార్చుకున్నారు. 

పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ, వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేస్తూ సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. పవన్ అభిమానులు దీన్ని తీవ్రంగా నిరసించారు. కొందరు ఆయనపై భౌతికంగా దాడి చేయటానికి ప్రయత్నించారు. కొంత కాలానికి రాజీ మార్గానికి వచ్చారు.  తాజాగా పిల్లల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించే ఉద్దేశంతో ఎగిసే తారాజువ్వలు అనే సినిమాకు శ్రీకారం చుట్టారు.  

loader