విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ పై కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. ఏపిలో నాయకత్వ లోపమే రాష్ట్రాభివృద్ధికి పెద్ద శాపంగా మారింది. పార్టీల మధ్య అనైక్యతను కేంద్రం అవకాశంగా తీసుకుంటోంది. ఎంతసేపు రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడే పార్టీలు ఏదన్నా సాధించాలనేటప్పటికి మాత్రం వెన్నుచూపుతున్నాయి. అందుకే తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కూడా ఏపికి అన్నీ విధాల కేంద్రం మొండి చెయ్యి చూపించింది. చివరకు విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాల్సి ప్రత్యేక రైల్వే జోన్ కూడా దక్కలేదు.

 వచ్చే సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఇదే చివరి పూర్తిస్ధాయి బడ్జెట్. కాబట్టి ఈ బడ్జెట్ లో అయినా ప్రత్యేక రైల్వేజోన్ పై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని అందరూ ఎదురు చూశారు. దానికితోడు పెండింగ్ ప్రాజెక్టులని, రాష్ట్రప్రయోజనాలని చంద్రబాబునాయుడు కూడా ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసిన సంగతి అందరకీ తెలిసిందే. మోడి-చంద్రబాబు భేటీ సందర్భంగా రాష్ట్రోంలోని పెండింగ్ ప్రాజెక్టుల్లో కొన్నింటికైనా మోక్షం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరకు జనాల చెవుల్లో కేంద్రం పెద్ద లోటస్ పువ్వునే పెట్టింది.

దీనికంతటికీ చంద్రబాబునాయుడే ప్రధాన బాధ్యత వహించక తప్పదు. ఎందుకంటే, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ రోజు కూడా కేంద్రంపై పోరాట స్పూర్తిని చూపించింది లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమని రాష్ట్రప్రయోజనాలను చంద్రబాబు పణంగా పెడుతున్నారని ప్రతిపక్షాలు ఎప్పటి నుండో చేస్తున్న ఆరోపణలు నిజమనే అనుకోవాలి.

అదే సమయంలో ఉత్తరాంధ్రలోని ప్రజాప్రతినిధులు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఏ విషయంలో కూడా సమైక్యంగా అందరూ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. ఉత్తరాంధ్రకు ప్రాణాధారమైన ప్రత్యేక రైల్వేజోన్ ను కూడా సాధించుకోలేకపోయినందుకు ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలి. అలాగే, విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఊసు కూడా లేదు.

విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్  ఏర్పాటుకు వ్యతిరేకంగా ఒడిస్సా ప్రభుత్వం పట్టుదల ఒకవైపు, చంద్రబాబు చేతకాని తనం ఇంకోవైపు కలిసి ఉత్తరాంధ్రకు శాపమైపోయింది. ఇప్పడు కూడా ప్రత్యేకరైల్వే జోన్ రాకపోతే భవిష్యత్తులో వచ్చే అవకాశాలు తక్కువని తెలిసి కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటం నిజంగా దురదృష్టమే. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేజోన్ కు విశాఖ డివిజన్ వల్ల ఏడాదికి రూ. 7500 కోట్ల ఆదాయం వస్తోంది. దాన్ని వదులుకోవటానికి ఒడిస్సా ప్రభుత్వం సిద్ధంగా లేదన్న విషయం అర్ధమైపోయింది.