Asianet News TeluguAsianet News Telugu

పులివెందులలోనూ జగన్ రెడ్డిని ఓడిస్తాం..: బుద్దా వెంకన్న సవాల్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేసారు. చివరకు పులివెందులలోనూ వైఎస్ జగన్ గెలిచే అవకాశాలు లేవని అన్నారు. 

We will defeat YS Jaganmohan Reddy in Pulivendula :  TDP Leader Budda Venkanna AKP
Author
First Published Dec 13, 2023, 4:57 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ  వైసిపి అధికారంలోకి రావడం కాదు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచి చూపించాలని టిడిపి ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజలే జగన్ ను నమ్మడం లేదని...  ఈసారి ఆయన ఓటమి ఖాయమని అన్నారు. రాయలసీమ ప్రజలు వైసిపిని నమ్మడంలేదని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతుందని బుద్దా వెంకన్న తెలిపారు. 

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేసారు. అధికారంలోకి రాగానే తాడేపల్లి, ఇడుపులపాయ ప్యాలెస్ లలో జగన్ రెడ్డి దాచుకున్న డబ్బును వెలికి తీస్తామన్నారు. వైసిపి నాయకులు ఎక్కడెక్కడ భూములు కబ్జా చేసారో బయటపెడతామని... వారిని బాధితులకే తిరిగి అప్పగిస్తామని వెంకన్న హామీ ఇచ్చారు.

మిచౌంగ్ తుఫాను కారణంగా కురిసిన అకాలవర్షాలు, ఈదురుగాలులకు రైతులు తీవ్రంగా నష్టపోయారని వెంకన్న గుర్తుచేసారు. ఇలా రైతులు పుట్టెడు బాధలో వుంటే మంత్రులు మాత్రం హాయిగా బస్సు యాత్రలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేవలం జగన్ రెడ్డి గురించి గొప్పలు చెప్పడానికే ప్రజల వద్దకు వెళుతున్నారని... వారిని ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు. చివరకు వ్యవసాయ మంత్రి కూడా రైతుల బాధ పట్టదన్నట్లుగా సామాజిక బస్సు యాత్రలో పాల్గొనడం దారుణమన్నారు. 

Also Read   ఎలక్షన్ మూడ్ లో అధికార వైసిపి... బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి కీలక బాధ్యతలు

మంత్రులు తుఫాను బాధిత రైతుల గోడు వినాలని వెంకన్న సూచించారు. అంతేగానీ దండుపాళ్యం గ్యాంగ్ లా గ్రామాలమీద పడొద్దని... వాలంటీర్ల ద్వారా రైతులను బెదిరించి మీటింగ్ లకు రావాలని ఒత్తిడి చేయరాదని సూచించారు. దున్నపోతుల్లా కాకుండా మనుషుల్లా వ్యవహరించాలంటూ మంత్రులను వెంకన్న సీరియస్ అయ్యారు. 

టిడిపి అధికారంలో లేకపోయిన తుఫాను బాధిత రైతులకు తోచినసాయం చేద్దామనే చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారని వెంకన్న తెలిపారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఏరియల్ సర్వేలతో సరిపెడుతున్నారని అన్నారు. కనీసం ప్రజలవద్దకు వెళ్లి బాధలు తెలుసుకునే సమయం కూడా లేదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో మొద్దునిద్ర పోతుంటే చంద్రబాబు తుఫాను బాధితుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. 

జగన్ రెడ్డి పాలనలో వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారే బాగుపడ్డారని... సామాన్యలు బాగుపడలేదని అన్నారు. జగన్ ఇంతకాలం దోచుకున్న సొమ్ములో కేవలం 10శాతం పంచినా రైతులు బాగుపడతారని అన్నారు. కానీ బాధితుల నుండి ఇంకా ఏం దోచుకోవాలనే సీఎం జగన్ ఆలోచిస్తుంటారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios