కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఒకవైపు నానాటికి క్షీణిస్తుంటే ఇంకోవైపు తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ టిడిపి ఎంపిలకు షాకిచ్చారు. విశాఖపట్నం రైల్వేజోన్ విషయమై మాట్లాడేందుకు ఎంపిలు మంత్రి అపాయిట్మెంట్ అడిగారు. మంత్రి కూడా మంగళవారం సాయంత్రం 4 గంటలకు సమయం ఇచ్చారు. అయితే అపాయిట్మెంట్ సమయాన్ని మార్చుకునేందుకు ఎంపిలు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చేసేది లేక అపాయిట్మెంట్ ప్రకారం ఎంపిలందరూ కేంద్రమంత్రి కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు.

మంత్రి కార్యాలయంలో వైట్ చేస్తుండగా అపాయిట్మెంట్ వాయిదా వేసినట్లు సిబ్బంది ఎంపిలతో చెప్పారు. దాంతో ఎంపిలు ఆశ్చర్యపోయారు. కేంద్రమంత్రి కార్యాలయంకు చేరుకున్న తర్వాత అపాయిట్మెంట్ వాయిదా పడిందని చెప్పటంతో మండిపడ్డారు. దాంతో ఏం  చేయాలో ఎంపిలకు అర్ధంకాక తలలు పట్టుకుని అక్కడే వెయిట్ చేస్తున్నారు.

ఇంతలో మంత్రి కార్యాలయంలో నుండి వైసిపి తిరుపతి ఎంపి వరప్రసాద్ బయటకు రావటం చూసిన టిడిపి ఎంపిలకు మతిపోయింది. మిత్రపక్షమైన తమకు అపాయిట్మెంట్ ఇచ్చి వాయిదా వేయటమే కాకుండా అదే సమయంలో వైసిపి ఎంపితో మంత్రి భేటీ అవటాన్ని టిడిపి ఎంపిలు జీర్ణించుకోలేకపోయారు. తిరుపతి రైల్వే సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వటానికి వరప్రసాద్ కేంద్రమంత్రిని కలిసినట్లు సమాచారం.

ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్రమంత్రి తమకు అపాయిట్మెంట్ ఇచ్చి వాయిదా వేశారని టిడిపి ఎంపిలు మండిపడుతున్నారు. చంద్రబాబును కేంద్రం ఏ స్ధాయిలో నిర్లక్ష్యం చేస్తోందో చెప్పటానికి ఈ ఘటనే ఉదాహరణగా పలువురు టిడిపి నేతలు ప్రస్తావిస్తున్నారు. జరిగిన విషయాన్ని అక్కడి నుండి చంద్రబాబుకు చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేశారు.