ఈ నెల 11వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చేపట్టిన వినూత్న కార్యక్రమంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసలు కురిపించారు.  బాలికే భవిష్యత్‌ పేరుతో ఆ రోజంతా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా బాలికలకు అవకాశం కల్పించడంపై కేంద్ర మంత్రి స్పందించారు.

బాలికే భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేసిన కలెక్టర్ ను కేంద్ర మంత్రి ట్విటర్‌ వేదికగా అభినందించారు. బాలికలకు ఇలాంటి అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించడం స్ఫూర్తిదాయకమని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.  

''ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు కూలీ కూతురు శ్రావణి(16) జిల్లా అధికారిగా ఒకరోజు(అక్టోబర్ 11) విధులు నిర్వహించారు. ఇలా జిల్లాలోని బాలికలకు ఒకరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాన అధికారులుగా పనిచేసే అవకాశాన్ని జిల్లా కలెక్టర్ కల్పించారు'' అంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడును కేంద్ర మంత్రి ప్రశంసించారు. 

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్‌గా ఆమె ఒకరోజు   బాధ్యతలను నిర్వహించారు. చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కూర్చోగా పక్కనే కలెక్టర్ చంద్రుడు చేతులు కట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పదవిలో బాలిక కొనసాగింది. 
 
అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తామంటే వారికి అవకాశం కల్పించాలని కూడా ఆదేశించారు. ఇలా నామమాత్రంగా కాకుండా ఒకరోజు పూర్తి అధికారాలతో విధులు నిర్వహించే అవకాశాన్ని బాలికలకు కల్పించినందుకు కేంద్ర మంత్రి  చేత ప్రశంసలు పొందారు అనంతపురం కలెక్టర్.