అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం  తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసిపి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వుంది. కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా కుదించింది. 

ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస వ్యయం అంతా కలిపి రూ.20,398.61 కోట్లు మాత్రమే ఏపీకి అందించనున్నట్లు కేంద్రం తేల్చేసింది. 2013లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ పోలవరం అంచనా వ్యయాన్ని 20వేల కోట్లుగా నిర్ణయించింది. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి విభాజ్య ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి సర్కార్ ఏర్పడింది. దీంతో ఆనాటి సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు పెంచారు. ఇదంతా కేంద్రమే భరించాలంటూ ఆనాడు టిడిపి, ప్రస్తుతం వైసిపి ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 

read more  నీటిపారుదల ప్రాజెక్టులపైనా కోవిడ్ ప్రభావం...: సీఎంకు వివరించిన అధికారులు

అయితే సవరించిన అంచనా వ్యయం 55 వేల కోట్లు ఇవ్వడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. 2013లో నిర్ణయించిన అంచనా వ్యయం రూ.20వేల కోట్లను మాత్రమే అందిస్తామని... ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి (పీపీఏ) తెలిపినట్లు సమాచారం. ఈ లెక్కన ఇప్పటివరకు కేంద్రం అందించిన నిధులు, రీఇంబర్స్‌ చేయాల్సిన మొత్తాన్ని మినహాయిస్తే ఇక రూ.4819.474 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వస్తాయన్నమాట.