Asianet News TeluguAsianet News Telugu

నీటిపారుదల ప్రాజెక్టులపైనా కోవిడ్ ప్రభావం...: సీఎంకు వివరించిన అధికారులు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై సీఎంకు నీటిపారుదల అధికారులు వివరాలు అందించారు. 

ap cm jagan review meeting irrigation projects
Author
Amaravathi, First Published Aug 12, 2020, 8:12 PM IST

అమరావతి: ఏపీలో చేపడుతున్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సీఎం వైఎస్ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్‌-2, పూల సుబ్బయ్య వెలిగొండ టన్నెల్‌–1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్ట్‌ –2లో స్టేట్‌ –2 పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అక్టోబరు నాటికి అవుకు టన్నెల్‌–2 పూర్తి చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇటీవల వర్షాలకు సొరంగ మార్గంలో మట్టి జారిందని, దాన్ని అరికట్టడానికి నిపుణుల కమిటీని ఏర్పాటచేసి వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతామన్నారు. అనుకున్న ప్రకారం అక్టోబరు నాటికి అదనంగా మరో 10వేల క్యూసెక్కుల నీరు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు అధికారులు. విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

తోటపల్లిలో మిగిలిపోయిన పనులు సహా వివిధ ప్రాజెక్టులకు రూ. 500 కోట్లు ఖర్చుపెడితే ఇక్కడ అన్ని ప్రాజెక్టులూ పూర్తవుతాయని సీఎం పేర్కొన్నారు. నెలకు కొంత మొత్తాన్ని కేటాయించుకుంటూ పోతే ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయన్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ నుంచి డిసెంబర్‌ మొదటి వారంలో నీటి విడుదలకు సిద్ధం చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 2.2 కిలోమీటర్లు తవ్వగలిగామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు టన్నెల్‌ –2 ను వేగంగా పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం.

read more   నాలుగోసారి వాయిదా:ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిపివేత

. నెల్లూరు బ్యారేజీలో సివిల్‌ పనులు దాదాపు పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు.గేట్ల బిగింపు ప్రక్రియను మొదలుపెట్టామని... మొత్తంగా 86.35శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. నవంబరు నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తిచేస్తామన్నారు. సంగం బ్యారేజీ కూడా నవంబర్‌ నాటికి పూర్తిచేస్తామన్నారు. 

వంశధార –నాగావళి లింకు పనులు డిసెంబరు చివరి నాటికి పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. వంశధార ప్రాజెక్టు రెండో ఫేజ్‌–2, స్టేజ్‌–2 పనుల ప్రగతిపై సీఎం ఆరా తీశారు. పనులు వచ్చే మార్చినాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. అలాగే నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఒడిశా సీఎంతో చర్చలకోసం లేఖరాసిన అంశాన్ని గుర్తుచేశారు. దీని రిప్లైకోసం వేచిచూడకుండా వారితో మాట్లాడి ఒడిశా సీఎంతో చర్చలను ఖరారుచేయాలన్నారు. అలాగే జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారానికి దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై సీఎంకు వివరాలు అందించారు.  కోవిడ్‌ సమయంలోకూడా పనులు కొనసాగించామని సీఎంకు అధికారులు వెల్లడించారు. పోలవరం స్పిల్‌వే పిల్లర్స్‌ ఈ ప్రభుత్వం వచ్చేనాటికి సగటు ఎత్తు 28 మీటర్లు కాగా ఇప్పుడు 51 మీటర్లుగా ఉందన్నారు. సెప్టెంబరు 15 కల్లా స్పిల్‌వే పిల్లర్స్‌ పనులు పూర్తవుతాయని సీఎంకు తెలిపారు. 

వర్షాకాలంలో కూడా పోలవరం పనులు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నామన్నారు. అలాగే ఎడమ కాల్వ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయన్నారు. పోలవరం 
పునరావాస కార్యక్రమాల్లో నాణ్యతపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. గండికోటలో 26.85 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు వీలుగా అవసరమైన ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు పూర్తిచేయాలన్నారు సీఎం. ఈసారి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios