ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై (Vizag Steel Plant)కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (Faggan Singh Kulaste) చేసిన ప్రకటనతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో కేంద్రం తాజాగా సంచలన ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఉక్కుశాఖ ప్రకటన విడుదల చేసింది. 

విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఆయన ప్రకటన చేసిన మరుసటి రోజే.. కేంద్రం పిడుగులాంటి ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేదని స్పష్టం చేసింది. సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని వెల్లడించింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉప సంహరణ ప్రక్రియ నడుస్తోందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ ప్రకటన విడుదల చేసింది. 

‘‘రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ఆగిపోలేదు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ (Visakha Steel Plant) పనితీరును మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ప్రకటనలో తెలిపింది. మొత్తానికి ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా కథనాల్లో నిజం లేదని తేల్చిపారేసింది. 

ఇంతకీ ఏం జరిగింది? 

విశాఖపట్నంలో గురువారం ప్రధాని రోజ్‌గార్‌ యోజన మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే ముఖ్య అథితిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణపై ఆసక్తికర ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన లేదనీ, రానున్న రోజుల్లో ప్లాంట్ బలోపేతం చేయడానికి తోడ్పడుతామని అన్నారు. అలాగే.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ముడి పదార్థాలు, సొంత గనులు వంటి పలు సమస్యలున్నాయని, వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రకటించారు. 

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రే స్వయంగా ఇలాంటి ప్రకటన చేయడంతో ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం వెనకడుగు వేసిందని అందరూ భావించారు. ఈ క్రమంలో అటు ఏపీ మంత్రులు, ఇటు తెలంగాణ మంత్రులు కూడా .. విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుకు వేసిందని పలు వ్యాఖ్యలు చేశారు. 

తరుణంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఓ అడుగు ముందుకేసి.. కేసీఆర్‌ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయం విషయంలో కేంద్రం తగ్గిందని అన్నారు.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎలా అమ్ముతారో చూస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. సింగరేణి అధికారులను పంపి అధ్యయనం చేయిస్తామని సీఎం కేసీఆర్‌ అనగానే.. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రతిపాదనను తాత్కాలికంగా విరమించుకుంటుందని అన్నారు. పైగా.. 'కేసీఆర్ దెబ్బ ఎట్లుంటదంటే.. గట్లుంటది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు.. మంత్రి హరీశ్‌రావు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణపై తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయంలో (ఏపీలో) అటు అధికార పక్షం నోరుమూసుకుందనీ, ప్రతిపక్షం ప్రశ్నించకపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్మికులు, ప్రజలు, బీఆర్‌ఎస్‌ పోరాటం చేసినందుకే కేంద్రం దిగి వచ్చిందనీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు విమర్శ ప్రతివిమర్శలకు తెర తీసాయి. అటు ఆంధ్ర మంత్రులు, ఇటు తెలంగాణ మంత్రులు విమర్శాస్త్రాలను సంధించుకున్నారు. మరీ తాజా పరిణామంతో తెలుగు రాష్ట్రాల రాజకీయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే..