ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. హైదరాబాద్ లో దిశ అనే పశువైద్యురాలు హత్యాచారానికి గురైన తర్వాత... ఇలాంటి ఘటనలో ఏపీలో చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిశ చట్టానికి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం నేరం నిరూపణ జరిగితే నిందితులకు ఉరిశిక్షే అంటూ ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ బిల్లుపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే.. ఈ బిల్లు విషయంలో జగన్ కి కేంద్రం షాకిచ్చింది. దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కి పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని... వాటిని సరిచేయాలని సూచించింది. ఈ దిశ బిల్లులో పొందుపరిచిన 7వ షెడ్యూల్ లో ఎంట్రీలు సరిగాలేవని.. వాటిని సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 

Also Read దిశ చట్టానికి అసెంబ్లీ ఆమోదం... మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల సంబరాలు.

కేంద్రం చెప్పిన సవరణల్ని సరిచేసే పనిలో ఇప్పుడు ఉన్నతాధికారులు ఉన్నారు. కేంద్రం నుంచి ఏపీ అసెంబ్లీకి బిల్లు రాగా... అక్కడి నుంచి ప్రభుత్వానికి చేరింది. కేంద్రం సూచలనకు అనుగుణంగా సాంకేతిక అంశాలను సరిచేసి.. మళ్లీ త్వరలోనే బిల్లును కేంద్రానికి పంపే అవకాశం ఉంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత అక్కడి నుంచి రాష్ట్ర్పతికి దగ్గరకు వెళ్లనుంది. ఆయన కూడా ఆమోదించిన తర్వాత చట్ట రూపంలో దిశ యాక్ట్ అమల్లోకి వస్తుంది.

ఇదిలా ఉంటే దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం తన కసరత్తును ముమ్మరం చేసింది. దిశ పోలీస్ స్టేషన్ లు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 7వ తేదీన దిశ పోలీస్ స్టేషన్, వన్ స్టాప్ సెంటర్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో దిశ స్పెషల్ యాప్, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్ ను ప్రారంభించనున్నారు.