అమరావతి: పంచాయితీ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయింటూ టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆ పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెదేపా సానుభూతిపరులు మెజార్టీ స్థానాలు గెలిచారన్నారు. 800సర్పంచ్ లకు సంబంధించి వచ్చిన ఫలితాల్లో దాదాపు 300చోట్ల తెదేపా అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసినా తెదేపా అభ్యర్థులు 300స్థానాల్లో గెలవడం సామాన్య విషయం కాదన్నారు. 

అధికార వైసిపి చెప్తున్న 500 పైచిలుక ఏకగ్రీవాలు తప్పుడు లెక్కలని... చాలా చోట్ల వాళ్ళ అభ్యర్థులు కానివారిని కూడా తమవారిగానే చెప్పుకోవడం జరుగుతోందన్నారు. తెలంగాణలో సీఎం జగన్ సోదరి షర్మిల పార్టీ పెట్టిన ముహూర్తమో ఏమో వైసిపి పతనం ప్రారంభమైందన్నారు దేవినేని ఉమా, అశోక్ బాబు. 

read more  తెలంగాణ పార్టీ: వైఎస్ షర్మిల ముందున్న సవాళ్లు ఇవే...

తొలిదశ ఏపీ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 1,827, వైసీపీకి 157 ఓట్లు వచ్చాయి. దాదాపు 40 ఏళ్ల తర్వాత నిమ్మాడలో టీడీపీ గెలుపొందడం విశేషం. పంచాయతీ ఎన్నికల సందర్భంగా నిమ్మాడలో అచ్చెన్నాయుడి కుటుంబం 40 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా గెలుస్తూ వస్తోంది. కింజరాపు కుటుంబ సభ్యులు, బంధువులు సర్పంచ్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు.

 ఈ ఆనవాయితీకి ఈ సారి బ్రేక్ పడింది. వైఎస్సార్సీపీ తరఫున కింజరాపు కుటుంబానికే చెందిన అప్పన్న నామినేషన్ వేయడంతో పోటీ అనివార్యమైంది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిపై కింజరాపు అప్పన్న నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేయడాన్ని అడ్డుకోవడంలో భాగంగా బెదిరింపులకు పాల్పడ్డారనే కారణంతో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు బెయిల్ లభించింది.