అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు.. రంగంలోకి సీబీఐ , తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడి ఇంట్లో సోదాలు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీబీఐ సోదాల వ్యవహారం కలకలం రేపుతోంది. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 పేరిట అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలకు సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీబీఐ సోదాలు చేశారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 పేరిట అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ వాహనాల కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు జఠాదర ఇండస్ట్రీస్ చవ్వా గోపాల్ రెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. కీలకమైన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం. జఠాధర ఇండస్ట్రీస్‌తో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఇప్పటికే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారుల ఎదుట ఇప్పటికే రెండు సార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. అలాగే ఈ కేసులో ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
ALso REad: జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు: సెల్‌ఫోన్లు స్వాధీనం
బీఎస్ 3 వాహనాలను స్క్రాప్స్ కింద కొని బీఎస్ 4గా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా జేసీ ట్రావెల్స్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన వాటిలో చవ్వా గోపాల్ రెడ్డి పేరిట కొన్ని వాహనాలు వున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించింది జేసీ ట్రావెల్స్. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఇప్పటికే రూ.22 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.