పులివెందులలో  మాజీ మత్రి వైఎస్ వివేకానందరెడ్డి  ఇంటిని  సీబీఐ అధికారులు పరిశీలించారు. 

కడప: పులివెందులలోని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటిని ఆదివారంనాడు సీబీఐ అధికారులు పరిశీలించారు. నిన్న వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

ఇవాళ వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇంట్లో కూడా సీబీఐ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. వివేకానందరెడ్డి ఇంటికి ఇవాళ నలుగురు సభ్యుల సీబీఐ బృందం వచ్చింది. వివేకానందరెడ్డి బెడ్రూమ్, బాత్రూమ్ ను సీబీఐ అధికారులు పరిశీలించారు.

గత వారంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మూడు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారించారు. ఐదు రోజులుగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారిస్తున్నారు. ఇవాళ కూడా సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ప్రశ్నిస్తున్నారు. 

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ విషయమై రేపు సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై సుప్రీంకోర్టు రేపు మరింత స్పష్టత ఇచ్చే అవకాశం లేకపోలేదు. 2019 మార్చి 14వ తేదీ రాత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు హత్య చేశారు. ఈ హత్య వెనుక ఎవరున్నారు, హత్యకు గల ప్రధాన కారణాలపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుంది. 

also read:వివేకా రెండో భార్య ఆరోపణలు.. సీబీఐ కార్యాలయానికి సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, ఏం జరుగుతోంది..?

వైఎస్ వివేకానందరెడ్డి కేసు దర్యాప్తులో రోజుకొ కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోించారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్యకు , మొదటి భార్య కుటుంబానికి మధ్య ఆస్తి గొడవలున్నాయని అవినాష్ రెడ్డి ఆరోపించారు. రెండు రోజుల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం కూడా బయటకు వచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. రానున్న రోజుల్లో ఈ కేసులో మరికొన్ని అరెస్ట్ లు కూడా జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ కేసును ఇప్పటివరకు విచారించిన రాంసింగ్ స్థానంలో మరొకరిని విచారణ అధికారిగా సీబీఐ నియమించిన విషయం తెలిసిందే.