అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని రథం ఎలా అగ్నికి ఆహుతైందన్న అంశంపై ఏపీలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికే ప్రత్యేక విచారణకు సీఎం జగన్ ఆదేశించారు. అయితే ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ అధికారిక జీవో శుక్రవారం వెలువడనున్నట్లు తెలుస్తోంది. 

ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఏపీ పోలీసులు విచారణ చేపడుతున్నా కొన్ని రాజకీయ పార్టీలు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించడమైనది. 

read more   అంతర్వేది ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్.. ఈవో‌ సస్పెన్షన్

అంతర్వేదిలో రథం దగ్ధం కావడంపై  దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ను విచారణ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఆలయ ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయంలో సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షణలో విఫలమయ్యారంటూ ఈవోపై వేటు పడింది.

అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైన ప్రాంతాన్ని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు పరిశీలించారు. రథం దగ్దమైనట్లు తెలిసిన వెంటనే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించి విచారణకు డీజీపీని ఆదేశించారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. తాజాగా సిబిఐ విచారణకు కూడా ఆదేశించింది జగన్ సర్కార్.