అంతర్వేది ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిలో భాగంగా ఆలయ ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయంలో సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షణలో విఫలమయ్యారంటూ ఈవోపై వేటు పడింది.

అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైన ప్రాంతాన్ని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు పరిశీలించారు.

అంతర్వేది రథం దగ్దమైనట్లు తెలిసిన వెంటనే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించి విచారణకు డీజీపీని ఆదేశించారని దేవాదాయ శాఖ మంత్రి   వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు.

పూర్తి విచార‌ణ జ‌రిపించాలని... ర‌థం కాలిపోవ‌డానికి కార‌కులు ఎవరయినా క‌ఠిన చ‌ర్య‌లు తీ‌సుకోమ‌ని డిజిపికి సూచించారని అన్నారు. ర‌థం కాలిపోవ‌డం దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న అని స్పందిస్తూనే నూత‌న ర‌థాన్ని త‌యారు చేసి ఫిబ్ర‌వ‌రిలో ఏదైతే ర‌థోత్స‌వం ఉంటుందో ఆనాటికి ర‌థాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డం జ‌రిగిందని వెల్లంపల్లి వెల్లడించారు.

ఇటువంటివి ఘటనలు పున‌రావృతం కాకుండా ఇప్ప‌టికే రాష్ట్ర‌వ్యాప్తంగా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింది. డిపార్ట్ మెంట్ త‌రపున అన్ని చ‌ర్య‌లు తీసుకుంటాము'' అని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. a