విశాఖపట్నం: డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సీబీఐ రంగంలోకి దిగింది. డాక్టర్ సుధాకర్ మీద విశాఖ పోలీసులు దాడి చేశారనే ఆరోపణపై దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు సుధాకర్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. సుధాకర్ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆరు గంటల పాటు ఆస్పత్రిలో సిబిఐ విచారణ సాగింది.

తన వాంగ్మూలంలో సుధాకర్ కీలకమైన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సుధాకర్ శరీరంపై గాయాలు, న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంపై సిబిఐ అధికారులు విచారణ జరిపారు. కెజీహెచ్ ఆస్పత్రి సూపరింటిండెంట్ రాధారాణిని కూడా వారు విచారించారు.

ఇదిలావుంటే, విశాఖ పోలీసులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ హైకోర్టు ఆదేశం మేరకు నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ కేసు దర్యాప్తు బాధ్యత తీసుకున్న సీబీఐ అధికారులు, శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. డాక్టర్‌ సుధాకర్‌ అభియోగాల మేరకు విశాఖపట్నంలో గుర్తుతెలియని పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, మరికొందరిపై 120-బీ, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. 

Also Read: ఆ మందులపై అనుమానం.. పిచ్చివాడిగా మార్చే యత్నం: హైకోర్టులో సుధాకర్ పిటిషన్

నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకు పైగా అక్రమ నిర్బంధం, దొంగతనం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై విశాఖపట్నం సీబీఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశం మేరకు శుక్రవారం న్యాయమూర్తుల సమక్షంలో డాక్టర్‌ సుధాకర్‌ నుంచి సీబీఐ అధికారులు ఫిర్యాదు తీసుకున్నారు. తన ఫిర్యాదులో డాక్టర్‌ సుధాకర్‌ చెప్పిన విషయాల ఆధారంగా ఆ కేసు నమోదుచేశారు.

Also Read: ప్రభుత్వం కక్ష సాధిస్తోంది: డాక్టర్ సుధాకర్ తల్లి ఆరోపణ

తన కుమారుడికి సరైన వైద్యం అందడం లేదని సుధాకర్ తల్లి ఆరోపిస్తున్నారు. వైద్యులు చేస్తున్న చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని ఆమె అంటున్నారు.