ఆపరేషన్ గరుడపై స్పందించిన మాజీ జెడీ లక్ష్మినారాయణ

ఆపరేషన్ గరుడపై స్పందించిన మాజీ జెడీ లక్ష్మినారాయణ

విజయనగరం: ఆపరేషన్ గరుడపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మీనారాయణ స్పందించారు. తనకు ఆపరేషన్ గరుడ గురించి తెలియదని, అబ్దుల్ కలామ్ చెప్పిన గరుడ గురించి మాత్రమే తెలుసునని ఆయన అన్నారు. 

అబ్దుల్ కలామ్ చెప్పినట్టు గరుడ పక్షిలా దృక్పథం అలవరుచుకోవాలని, అదే తనకు తెలుసునని అన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బిజెపితో తనకు సంబంధాలున్నాయని అంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. 

బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏ సందర్భంలో అలా మాట్లాడారో తనకు తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తాను ఎవరితో టచ్‌లో లేనని, రైతులు, కళాకారులు, విద్యార్థులతో మాత్రమే టచ్‌లో ఉన్నానని చెప్పారు. 

సామాజిక వర్గం గురించి ఎప్పుడూ ఆలోచించనని, గడప దాటగానే సమాజమే తన వర్గమని ఆయన అన్నారు. ఇంటి బయటకు వచ్చిన తర్వాత సామాజికవర్గం నుంచి బయటపడాలని ప్రజలను విభజించాలని అనుకునేవారు నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. 

తాను ఏం చేసినా మనసు పెట్టి నిబద్ధతతో చేస్తానని, పాపులారిటీ అనేది తనకు సైడ్ ఎఫెక్ట్‌లాంటిదని అన్నారు. దానికోసం తానెప్పుడూ పనిచేయనని స్పష్టం చేశారు. తను పాపులారిటీ కోసం చేస్తున్నాననే విమర్శలు భయం నుంచి వచ్చాయని అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page