ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు.. అమరావతి రైతుల పాదయాత్రకు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంఘీభావం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్రకు (amaravati farmers padayatra) సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ (cbi ex jd lakshmi narayana) మద్దతు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్రకు (amaravati farmers padayatra) సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ (cbi ex jd lakshmi narayana) మద్దతు తెలిపారు. ఆదివారం పాదయాత్రకు సంఘీభావం తెలిపన లక్ష్మీ నారాయణ.. వారితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరాతి రైతులు వారి ప్రయోజనాల కోసం పాదయాత్ర చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. అమరావతి రైతుల ఉద్యం ఏ ఒక్కరికో చెందినది కాదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రైతులు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే అభివృద్ది జరుగుతుందని అన్నారు. రాజధాని ఒక్కచోట ఉంటేనే పెట్టుబడులు వస్తాయని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని నిరుద్యోగ శాతం పెరిగిపోతుందని జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినప్పుడే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వాలు మారిన కూడా పాలసీలు మారకూడదని అన్నారు. పాదయాత్రకు మద్దతిచ్చినవారిపై కేసులు పెట్టడం సరికాదని అన్నారు.
గతంలో కూడా అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి లక్ష్మీ నారాయణ మద్దుతు తెలిపిన సంగతి తెలిసిందే. తుళ్లూరులో రైతుల శిబిరం వద్దకు వచ్చిన ఆయన తన సంఘీభావం తెలియజేశారు. రైతులు చేపట్టబోయే పాదయాత్రం మద్దతిస్తున్నట్టుగా ఆనాడే ప్రకటించారు. రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతి అంశం రాష్ట్రానికి సంబంధించిన సమస్య అని అన్నారు. అమరావతి వెనుక ఇతర ఉద్దేశాలు ఆపాదించడం సరికాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
ఇక, అమరావతి రైతులు పాదయాత్ర నేడు 35వ రోజు కొనసాగుతుంది. ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగలో పాదయాత్రను ప్రారంభించిన రైతులు.. వెంకటరెడ్డిపల్లి, అంబలపూడి, బాలాయపల్లి మీదుగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈరోజు రైతుల పాదయాత్ర వెంగమాంబపురంలో ముగియనుంది.
న్యాయ స్థానం నుంచి దేవస్థానం వరకు..
సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఉద్యమ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర చేపట్టానలి అమరావతి రైతులు నిర్ణయించారు. అయితే ఇందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫు వాదనలతో ఏకీ భవించిన కోర్టు.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.
దీంతో రైతులు నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర సాగనుంది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగనుంది. రైతుల పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ.. పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.