వివేకా కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట, ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్ట్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలతో తనకు 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు ఆయన ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. దీనిని పరిశీలించిన కోర్ట్ సానుకూలంగా స్పందించింది. భాస్కర్ రెడ్డికి 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
కాగా.. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న పులివెందులలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 120బీ రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డిని సీఐబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివేకాను హతమార్చిన తర్వాత సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ ఆరోపిస్తోంది. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా ప్రచారం జరగడం వెనుకా భాస్కర్ రెడ్డి పాత్ర వున్నట్లుగా ఆరోపించారు.
ALso Read: వైఎస్ వివేకా కేసు : రిటైర్డ్ ఐఏఎస్సే వెనక్కి తగ్గితే ఎలా.. జగన్ సలహాదారు అజేయ కల్లంపై సీబీఐ అసహనం
నాటి నుంచి చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో వుంటున్న భాస్కర్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో వుంచుకుని బెయిల్ ఇవ్వాల్సిందిగా పలుమార్లు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వాటిని కోర్ట్ తిరస్కరిస్తూ వచ్చింది. ఈ నెల ప్రారంభంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సైతం సీబీఐ న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే.