వైఎస్ వివేకా కేసు : రిటైర్డ్ ఐఏఎస్సే వెనక్కి తగ్గితే ఎలా.. జగన్ సలహాదారు అజేయ కల్లంపై సీబీఐ అసహనం
వైఎస్ వివేకా కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ సలహాదారు అజేయ కల్లం పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది . న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించేలా అజేయ కల్లం ప్రయత్నిస్తున్నారని.. ఐఏఎస్‌గా రిటైరైన వ్యక్తికి దర్యాప్తు, న్యాయవ్యవస్థపై విశ్వాసం వుండాలని సీబీఐ వ్యాఖ్యానించింది.

వైఎస్ వివేకా కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ సలహాదారు అజేయ కల్లం పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో తన వాంగ్మూలం వక్రీకరించారని అజేయ కల్లం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్‌ను ఆయన సతీమణి భారతి పైకి పిలిచి ఏదో చెప్పారని తాను చెప్పినట్లు సీబీఐ తప్పుగా చెప్పిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ.. గతంలో అజేయకల్లం విచారణ ఆడియో రికార్డింగ్‌కు సీల్డ్ కవర్‌లో శనివారం కోర్టుకు సంబంధించింది.
ఇదే సమయంలో అజేయ కల్లంపై సీబీఐ ఆగ్రహం వ్యక్త చేసింది. వాంగ్మూలం నమోదు చేసే సమయంలో ఆయన సీఎంకు ప్రధాన సలహాదారుగా వున్నారంటూ దుయ్యబట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనుబంధాన్ని అజేయకల్లం కూడా పిటిషన్‌లోనూ అంగీకరించారని సీబీఐ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆయన ప్రభావితమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని.. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు తర్వాత వచ్చిన అంశాలుగా సీబీఐ వ్యాఖ్యానించింది. అందుకే అజేయ కల్లం తన వాంగ్మూలం వెనక్కి తీసుకుంటున్నారని.. కొందరిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. వివేకా కేసులో అమాయకులను ఇరికించేందుకు తాము ప్రయత్నించలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చిచెప్పింది.
ALso Read: వివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..
కాగా.. వైఎస్ వివేకా కేసులో దర్యాప్తు ముగిసిందని.. ఈ ఏడాది ఏప్రిల్ 24న అజేయకల్లం అనుమతితోనే ఆయన ఇంట్లోనే వాంగ్మూలం నమోదు చేశామని సీబీఐ స్పష్టం చేసింది. దీనిని చదివి వినిపించామని.. ఈ కారణం చేత అజేయ కల్లం పిటిషన్ విచారణకు అర్హం కాదని సీబీఐ తన కౌంటర్‌లో ప్రస్తావించింది. వాంగ్మూలంలో వాస్తవాలు నమోదు చేసినట్లు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని.. అజేయ కల్లానికి సీఆర్‌పీసీ సెక్షన్ 161 ఉద్దేశ్యమేంటో తెలుసునని సీబీఐ పేర్కొంది. ప్రాసిక్యూషన్‌ను దెబ్బతీసేలా పిటిషన్ వేశారని.. దర్యాప్తు అధికారిపై ఆరోపణలు అబ్ధమని కేంద్ర దర్యాప్తు సంస్త వెల్లడించింది. న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించేలా అజేయ కల్లం ప్రయత్నిస్తున్నారని.. ఐఏఎస్‌గా రిటైరైన వ్యక్తికి దర్యాప్తు, న్యాయవ్యవస్థపై విశ్వాసం వుండాలని సీబీఐ వ్యాఖ్యానించింది.
ట్రయల్ సమయంలో అజేయ కల్లంను క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం వుందని సీబీఐ అభిప్రాయపడింది. తన వాంగ్మూలాన్ని రికార్డుల నుంచి తొలగించాలనడం ప్రాసిక్యూషన్‌ను పక్కకు మళ్లించడమేనని సీబీఐ అసహనం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఐఏఎస్‌గా చేసిన వ్యక్తే వెనక్కి తగ్గితే.. ఇతర సామాన్య సాక్షుల పరిస్ధితి ఏంటని సీబీఐ ప్రశ్నించింది.