మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఏప్రిల్ 14న ఉదయ్‌ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడిని ఆరు రోజుల పాటు విచారించింది. ప్రస్తుతం గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అయితే ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. 

అయితే ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. వివేకా హత్య కేసుకు సంబంధించిన కేసు డైరీ కాపీని అందజేసింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైతే ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన కౌంటర్ అఫిడవిట్‌లో కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలు సేకరించిన తర్వాత అతడిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. 

ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడని పేర్కొంది. హత్యా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు వివేకా హత్య 2019లో జరిగిందని.. నాలుగేళ్లపాటు విచారణ జరిగిందని ఉదయ్‌కుమార్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఉదయ్ కుమార్ రెడ్డి నెల రోజుల క్రితమే అరెస్టు చేశామని.. అతడు జైలులో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. 

ఈ క్రమంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. మే 11న ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఈ రోజు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.