టిడిపికి పెద్ద షాకే తగిలింది. నెల్లూరుకు చెందిన పార్టీ ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకులను వందల కోట్ల రూపాయలకు మోసం చేసిన కేసులో ఎంఎల్సీ అరెస్టయ్యారు. మోసం చేసిన కేసులో బ్యాంకులు సిబఐకి ఫిర్యాదు చేసాయి. వివిధ బ్యాంకుల నుండి వాకాటి సుమారు 190 కోట్లు రుణంగా తీసుకున్నారు. అయితే, తీసుకున్న రుణాన్ని చెల్లించకుండా ఎగొట్టారు. దాంతో బ్యాంకులు వాకాటిపై ఫిర్యాదు చేశాయి. ఆ కేసు సిబిఐకి చేరింది. దాంతో సిబిఐ పోలీసులు రంగంలోకి దిగారు.

సిబిఐ ఎంత గాలించినా వాకాటి ఆచూకీని కనుగొనలేకపోయారు. వాకాటి అరెస్టులో సిబిఐ స్ధానిక పోలీసుల సహాయం తీసుకుంది. అయితే, పోలీసులు వాకాటి ఆచూకీని కనుక్కోలేకపోయారు. విచిత్రమేమిటంటే, ప్రతీ పార్టీ మీటింగుల్లోనూ వాకాటి పాల్గొంటూనే ఉన్నా పోలీసులకు మాత్రం దొరకటం లేదు. చివరకు లాభం లేదనుకున్న సిబిఐ తన నెట్ వర్క్ ను జాగ్రత్తగా మోహరించింది. ఆదివారం వాకాటి బెంగుళూరులో ఉన్నట్లు కనుగొన్నది. వెంటనే ఎక్కడున్నది కనుక్కొని అరెస్టు చేసేసింది.

వాకాటి తీసుకున్న రుణం రూ. 190 కోట్లు కాస్త ఇపుడు రూ. 205 కోట్లకు చేరుకున్నది. నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసం చేయటం, ఆస్తుల విలువ అసలుకన్న ఎక్కువగా చూపించటం, తీసుకున్న రుణాలను ఎగ్గొట్టటం లాంటి ఆరోపణలను వాకాటి ఎదుర్కొంటున్నారు. మొన్ననే నెల్లూరు ఫిరియింపు మేయర్ అబ్దుల్ అజీజ్ పైన కూడా రూ. 40 కోట్ల చీటింగ్ కేసు చెన్నైలో నమోదైంది.

అదేవిధంగా ఎంఎల్ఏ రామారావుపైన కూడా మహారాష్ట్రలో అవినీతి ఆరోపణలపై అక్కడి ఏసిబి కేసు నమోదు చేసింది. అరెస్టు వారెంటు కూడా జారీ అయ్యింది. అలాగే కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టినందుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ అయిన సంగతి అందరకీ తెలిసిందే. వీళ్ళే కాదు పలువురు ప్రజాప్రతినిధులపై బ్యాంకుల్లో రుణాలు ఎగొట్టిన కేసులు విచారణలో ఉన్నాయి.