పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు పోలీసు స్టేషన్ లో టీడీపీ నేత నారా లోకేష్ మీద కేసు నమోదైంది. అవగాహన లేకుండా ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమైనందుకు ఆయనపై కేసు పెట్టారు.
ఏలూరు: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ మీద పోలీసులు కేసు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు పోలీసు స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. నారా లోకేష్ కు ట్రాక్టర్ డ్రైవింగ్ మీద అవగాహన లేదని, అయినప్పటికీ ఆయన వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమయ్యారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.
నారా లోకేష్ మీద ఐపీసీ 279, 184, 54ఏ సెక్షన్ల కింద ఎపిడమిక్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటించలేదని కూడా ఆయనపై కేసు నమోదు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో నారా లోకేష్ సోమవారంనాడు అకివీడు మంజలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. అయితే ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పుటేరు కాలువలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్ ను అదుపు చేశారు.
ఆ తర్వాత నారా లోకేష్ ను ట్రాక్టర్ మీది నుంచి దింపేశారు. దాంతో నారా లోకేష్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
