విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో నకిలీ పూజారి బాగోతం ఒక్కటి వెలుగు చూసింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో నకిలీ పూజారి అచ్చిరెడ్డి అక్రమాలు వెలుగు చూశాయి. భక్తికి సంబంధించిన యూట్యూబ్ చానెల్ లో భాగస్వామ్యం ఇస్తానంటూ తన నుంచి 18 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఖమ్మం జిల్లాకు చెందిన యువతి అచ్చిరెడ్డిపై ఫిర్యాదు చేసింది.

అచ్చిరెడ్డి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగ్నంగా పూజలు చేస్తే సినీ నటివి అవుతావంటూ కూడా యువతిని మోసం చేసినట్లు తెలుస్తోంది. పలువురు మహిళలను హోమాలు, పూజల పేరుతో టోకరా ఇచ్చినట్లు కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

విజయవాడలోని భవానీపురంలోని తన నివాసం వద్ద అతను కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన వద్దకు వచ్చిన మహిళలను మోసం చేస్తూ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ మహిళ వద్ద హోమం కోసం లక్ష రూపాయలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అచ్చిరెడ్డి పలువురు మహిళలను మోసం చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా యువతి ఫిర్యాదు చేసిన వెంటనే తన నివాసం నుంచి అచ్చిరెడ్డి మాయమైనట్లు తెలుస్తోంది.