ఆ పనిచేస్తే...జగన్ కు తిరుగుండదు

Can ys jagan succeeds in getting national parties support on no motion confidence issue
Highlights

  • జాతీయ స్ధాయి పార్టీల అధినేతలతో తనకున్న పరిచయాలను చాటి చెప్పేందుకు జగన్ కు మంచి అవకాశం వచ్చింది.

అవిశ్వాసతీర్మానం గురించి పవన్ కల్యాణ్ ఎందుకు ప్రస్తావించారో? వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సవాలు విసిరారో? కానీ పవన్ ప్రస్తావన ఒక విధంగా జగన్ కు అనుకూలంగానే మారిందనే చెప్పుకోవాలి. జాతీయ స్ధాయి పార్టీల అధినేతలతో తనకున్న పరిచయాలను చాటి చెప్పేందుకు జగన్ కు మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని గనుక సక్రమంగా ఉపయోగించుకుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కు చాలా లాభముంటుంది. అదే సమయంలో చంద్రబాబునాయుడు బలహీనతలను కూడా ఎత్తి చూపినట్లవుతుంది.

       జగన్ కు వచ్చే లాభమేంటి?

1-పవన్ చెబుతున్నట్లు వైసిపి అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలంటే ఒక్క సభ్యుడు సరిపోవచ్చు. కానీ తీర్మానం స్పీకర్ ఆమోదం పొందాలంటే మాత్రం 54 మంది ఎంపిల మద్దతు అవసరం. ఆ మద్దతును పవన్ సేకరిస్తారా? లేకపోతే జగనే సేకరిస్తారా అన్నది ఆసక్తకరంగా మారింది. జాతీయపార్టీల మద్దతు తాను సంపాదిస్తానని పవన్ చెబుతున్నా అది ఎంత వరకూ సాధ్యమో చూడాలి. అయితే, 54 మంది ఎంపిల మద్దతు కూడగట్టటం జగన్ కు చాలా తేలిక. ఒకవేళ జగన్ గనుక మద్దతు సంపాదించగలిగితే జాతీయ పార్టీల అధినేతల వద్ద జగన్ కున్న పట్టుకు నిదర్శనంగా నిలుస్తుంది.

            చంద్రబాబు ఏం చేస్తారు?

చంద్రబాబుతో సంబంధం లేకుండానే జగన్ గనుక ఎంపిల మద్దతు సంపాదించగలిగితే రాష్ట్రంలో రాజకీయంగా చంద్రబాబుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. రేపటి రోజున పార్లమెంటులో అవిశ్వాసతీర్మానం చర్చకు వస్తే చంద్రబాబు స్టాండ్ ఏంటో తేలిపోతుంది. ఎన్డీఏలో ఉంటూ అవిశ్వాసతీర్మానానికి చంద్రబాబు మద్దతు ఇవ్వలేరు. ఒకవేళ ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేస్తే జరగబోయేదేంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే ఎన్డీఏలో నుండి బయటకు రానంటున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జనాల ముందు చంద్రబాబు దోషిగా నిలబడాల్సిందే.

                   పవన్ ఏం చేస్తారు?

పార్లమెంటులో అవిశ్వాసతీర్మానం చర్చకు వచ్చినపుడు చంద్రబాబు స్టాండ్ పై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇంతకాలం చంద్రబాబుకు సమస్య వచ్చినపుడల్లా పవన్ ఆదుకుంటున్నారు. రేపటి రోజున తీర్మానం విషయంలో చంద్రబాబు నాటకాలు కంటిన్యూ చేస్తే పవన్ స్టాండ్ ఏంటనేది కూడా తేలిపోతుంది.

          మోడితో సున్నం పెట్టుకుంటారా?

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టటమంటే ప్రధానమంత్రి నరేంద్రమోడితో సున్నం పెట్టుకోవటమే. ఎంతమంది అందుకు సిద్దపడతారో తెలీదు. నోటిమాటగా మద్దతు తెలపటం వేరు, రాతమూలకంగా మద్దతు ఇవ్వటం వేరు. మోడితో బద్ద విరోధం ఉన్నవారే తీర్మానానికి మద్దతుగా నిలవాలి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ లాంటి పార్టీల మద్దతును సంపాదించ గలిగితే రేపటి ఎన్నికల్లో జగన్ కు ఎంతో ఉపయోగం ఉంటుందనటంలో సందేహం లేదు.

loader