వైసిపి తరపున గెలిచి తర్వాత ఫిరాయించిన అరకు ఎంపి కొత్తపల్లి గీతపై క్రమశిక్షణ చర్యల క్రింద వేటు తప్పదా? వైసిపిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వేటు తప్పదనే అనిపిస్తోంది. ఎందుకంటే, లోక్ సభలో వైసిపి చీఫ్ విప్ వైవి సుబ్బారెడ్డి షో కాజ్ నోటీసు జారీ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు సభ్యత్వంపై ఎందుకు వేటు వేయకూడదో చెప్పమంటూ వైవి అరకు ఎంపికి షో కాజ్ నోటీసు జారీ చేశారు. సరే, ఎంపి కూడా ఏమీ తక్కువ తినలేదనుకోండి అది వేరే సంగతి.

ఇంతకీ ఏమి జరిగిందంటే, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఎంపిలందరూ కట్టుబడి ఉండాలంటూ వైవి విప్ జారీ చేశారు. వైసిపి తరపున గెలిచి తర్వాత ఫిరాయించిన ముగ్గురు ఎంపిలు కొత్తపల్లి గీత, ఎస్సీవై రెడ్డి, బుట్టా రేణుక కు కూడా విప్ వర్తిస్తుంది.

ఫిరాయింపు ఎంపిలు కూడా విప్ అందుకున్నారు. మంగళవారం నాడు లోక్ సభలో స్పీకర్ అవిశ్వాస తీర్మానం చదివి వినిపించినపుడు వైసిపి సభ్యులందరూ లేచి నిలబడ్డారు. అయితే, గీత మాత్రం కనబడలేదట. అందుకనే విప్ ఉల్లంఘించినందుకు గీతపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ వైవి ఎంపికి షో కాజ్ నోటీసు జారీ చేశారు.

అందుకు గీత సమాధానమిస్తూ తాను కూడా అందరితో పాటు లోక్ సభలోనే ఉన్నట్లు చెప్పారు. అసలు సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చే జరగనపుడు తాను గైర్హాజరయ్యే అంశమే ఉత్పన్నం కాదన్నారు. తనపై వ్యక్తిగతకక్ష తీర్చుకునేందుకే షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు గీత అభిప్రాయపడ్డారు. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేట్లైతే తాను న్యాయపరమైన పోరాటం చేస్తానని కూడా హెచ్చరించారు. మరి వైసిపి-గీత మధ్య మొదలైన సమస్య ఎలా పరిష్కారమవుతుందో  చూడాల్సిందే.