రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడులో మిత్రపక్షం బిజెపి టెన్షన్ పట్టుకుంది. ఏపిలో ఖాళీ అయ్యే మూడు స్ధానాలకు వచ్చే నెల 23వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరుగనుంది. ఖాళీ అయ్యే మూడు స్ధానాల్లో రెండు టిడిపికి ఒకటి వైసిపికి దక్కుతాయి.  రాష్ట్రంలోని 175 మంది ఎంఎల్ఏల సంఖ్య ఆధారంగా ఒక్కో రాజ్యసభ స్ధానానికి ఎంతమంది ఎంఎల్ఏలు ఓట్లు వేయాలో ఎన్నికల కమీషన్ నిర్ధారిస్తుంది.

దాని ప్రకారం ఒక్కో రాజ్యసభ స్ధానానికి 44 మంది ఎంఎల్ఏల ఓట్లు అవసరం. ఆ లెక్కన టిడిపికి 103 మంది ఎంఎల్ఏల బలముంది కాబట్టి రెండు స్ధానాలు దక్కుతాయి. అదే విధంగా వైసిపికి కూడా ప్రస్తుతం 44 మంది ఎంఎల్ఏలున్నారు కాబట్టి మూడో స్ధానం దక్కుతుంది. ఎవరి ఎంఎల్ఏలు ఆ పార్టీ అభ్యర్ధులకే ఓట్లు వేసుకుంటే ఏ గొడవా ఉండదు.

అయితే, వైసిపికి దక్కుతుంది అనుకుంటున్న మూడో స్ధానాన్ని దక్కనీయకుండా చేయాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. వైసిపి నుండి ఓ ఇద్దరు ఎంఎల్ఏలను లాక్కుని జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలన్నది చంద్రబాబు వ్యూహం.

అయితే, ఇక్కడే చంద్రబాబులో టెన్షన్ మొదలైందట. మూడో స్దానం కోసం గనుక చంద్రబాబు అభ్యర్ధిని రంగంలోకి దింపితే అప్పుడు మిత్రపక్షం బిజెపి మద్దతు కీలకమవుతుంది. బిజెపికి నలుగురు ఎంఎల్ఏలున్నారు. 103 మంది ఎంఎల్ఏల ఓట్లలో 88 పోను ఇంకా 15 ఓట్లు టిడిపికి మిగిలిపోతాయి. అపుడు బిజెపికున్న 4 గురు ఎంఎల్ఏలు, ఇద్దరు స్వతంత్ర ఎంల్ఏలు, 22మంది ఫిరాయింపు ఎంఎల్ఏలను లెక్కేస్తే టిడిపికి 43 మంది ఎంఎల్ఏల ఓట్లుంటాయి. అంటే మూడో స్ధానం గెలుచుకునేందుకు టిడిపికి ఒక్క ఓటు తక్కువవుతుంది.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత రెండు పార్టీల మధ్య మంటలు రేగుతున్నాయి. మార్చి 5వ తేదీ నుండి బడ్జెట్ రెండో సెషన్ మొదలవుతుంది. అప్పటికి పొత్తుల విషయంలో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. ఒకవేళ పొత్తులు విడిపోతే బిజెపి నుండి మద్దతు ఎటూ ఉండదు కాబట్టి చంద్రబాబు మూడో అభ్యర్ధిని నిలిపే అవకాశాలు తక్కువ. ఒకవేళ మిత్రపక్షంగానే ఉన్నా బిజెపి ఎటువంటి వైఖరి తీసుకుంటుందో అర్ధం కావటం లేదు.

ఎందుకంటే, ఫిరాయింపు మంత్రులు, ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించాలంటూ బిజెపి పట్టుబడుతోంది. ఇటువంటి నేపధ్యంలో మళ్ళీ ఫిరాయింపులను ప్రోత్సహించి మూడో రాజ్యసభ స్ధానాన్ని దక్కించుకోవాలన్న చంద్రబాబు నిర్ణయానికి మద్దతు ఇస్తుందా అన్నది అనుమానమే. అందుకే మూడు సీటు విషయంలో చంద్రబాబుకు బాగా టెన్షన్ పట్టుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్