విశాఖపట్నంలో బయటపడిన భారీ భూకుంభకోణంలో చంద్రబాబు, లోకేష్ భాగస్వామ్యం ఉందంటూ వైసీపీ వాయించేస్తోంది. అయినా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. ఇక్కడే గంటా-చంద్రబాబు బంధంపై అనుమానాలు వస్తున్నాయి.

ఇద్దరు ఎంఎల్సీలను టిడిపి నుండి సస్పెండ్ చేసిన చంద్రబాబునాయుడు అదే ఆరోపణలనo ఎదుర్కొంటున్న గంటా శ్రీనివాసరావు విషయంలో మాత్రం ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, మంత్రివర్గ సహచరుడు కావటమేనా? లేకపోతే తనకు బాగా సన్నిహితుడైన సహచరమంత్రి నారాయణకు స్వయానా వియ్యంకుడు కావటమేనా? లేకపోతే పార్టీలో ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయముందా? అని పార్టీలో చర్చ మొదలైంది.

బ్యాంకుల నుండి రుణాలను తీసుకుని నెల్లూరు ఎంఎల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఎగొట్టారు. అదే విషయమై సిబిఐ దాడులు చేసింది. వెంటనే వాకాటిని పార్టీ నుండి సస్పెండ్ చేసారు చంద్రబాబు. అదే సమయంలో గంటా కూడా బ్యాంకుల నుండి రూ. 300 కోట్లు రుణం తీసుకుని ఎగొట్టిన విషయం వెలుగు చూసింది. అయినా ఇంత వరకూ ఆయనపై ఎటువంటి చర్యలూ లేవు.

ఇక, హైదరాబాద్ లో భూకబ్జా కేసులో ఇరుకున్న ఎంఎల్సీ దీపక్ రెడ్డి ఉదంతం కూడా అదే సమయంలో బయటపడింది. అయితే, ఆయనపైన కూడా చర్యలు లేవు. మరి వాకాటి చేసిన పాపం ఏంటి? దీపక్, గంటాలు చేసుకున్న పుణ్యమేంటో. దీపక్ ను క్రైం పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లికి పంపారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. దీపక్ చేసిన కబ్జాల్లో చంద్రబాబు, లోకేష్ కు వాటాలున్నాయంటూ వైసీపీ రెచ్చిపోతోంది. చివరకు చంద్రబాబు ఒత్తడికి లొంగి దీపక్ ను ఈరోజు సస్పెండ్ చేసారు.

మరి అదే ఆరోపణలను ఎదుర్కొంటున్న గంటాపై మాత్రం చంద్రబాబు చర్యలు తీసుకోవటం లేదు. ఈ విషయంలోనే తాజాగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. విశాఖపట్నంలో బయటపడిన భారీ భూకుంభకోణంలో చంద్రబాబు, లోకేష్ భాగస్వామ్యం ఉందంటూ వైసీపీ వాయించేస్తోంది. అయినా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. ఇక్కడే గంటా-చంద్రబాబు బంధంపై అనుమానాలు వస్తున్నాయి. పార్టీ ప్రతిష్ట కోసం గంటాపైనా చర్యలు తీసుకుంటారో లేక గంటా కోసం పార్టీనే పణంగా పెడతారో చూడాలి.