కేంద్ర-రాష్ట్ర సంబంధాల మధ్య తలెత్తిన వివాదాలను జాగ్రత్తగా గమనిస్తే అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఏదో మాట వరసకు చంద్రబాబు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్నారే గానీ అయ్యే అవకాశాలు లేవని సిఎంకు కూడా తెలుసు. ఎందుకంటే, ప్రాజెక్టు పూర్తవ్వాలంటే సుమారు రూ. 35 వేల కోట్లు కావాలట. అంత డబ్బు ప్రభుత్వం ఖర్చు చేయటన్నది కలలోని మాట. ఎందుకంటే, ప్రభుత్వమే అప్పుల మీద నడుస్తోందన్న విషయం అందరికీ తెలుసు.

కేంద్ర-చంద్రబాబు మధ్య సంబంధాలు బాగున్నపుడే కాంట్రాక్టు సంస్ధ ప్రాజెక్టు పనులు చేయటంలో నత్తకే నడకలు నేర్పించింది. ప్రస్తుత పరిస్ధితి అందరికీ తెలిసిందే. కాబట్టి పోలవరం పనులు ఊపందుకునే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ప్రాజెక్టు పూర్తవ్వటం లేదంటే అందుకు ప్రధాన వైఫల్యం చంద్రబాబుదే అనటంలో సందేహం లేదు.

ఇటువంటి పరిస్ధితుల్లో ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 58319 కోట్లను కేంద్రం వెంటనే ఆమోదించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రతిపాదనలు ఢిల్లీకి పంపుతున్నారు. ఇంత భారీ అంచనాలను కేంద్రం ఆమోదిస్తుందా అన్నదే సందేహం. ఎందుకంటే, రాష్ట్రం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదిస్తే ఆ మేరకు వ్యయాన్ని కేంద్రం భరించాలి. ప్రస్తుత పరిస్ధితుల్లో ఆ విషయాన్ని ఊహించలేం. కాబట్టి ప్రాజెక్టు పనులు పూర్తవ్వటం కలలోని మాట అనే వినిపిస్తోంది.