ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పదు. కేంద్రం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయదు.

‘దువ్విన తలనే దువ్వటం’ అని ఓ సినిమాలో పాటుంది. అలాగే ఉంది రాజధాని అమరావతి పనులు. ఎందుకంటే, ఒకే పనికి ప్రభుత్వం పదే పదే శంకుస్ధాపనలు చేయించటం తప్ప నిజంగా ఒక్కపని కూడా మొదలుపెట్టలేదు. ఇదంతా ఎందుకంటే సిఆర్డిఏ కమీషనర్ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన భవనాలు 18 నెలల్లో పూర్తి చేస్తామని తాజాగా చెప్పారు. ఇదే విషయమై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి రెండున్నరేళ్ళు పూర్తయింది. ఇంత వరకూ అమరావతి పేరుతో వందలాది కోట్ల రూపాయలు వృధా కావటం తప్ప క్షేత్రస్ధాయిలో పని ఏమీ మొదలే కాలేదు.

అటువంటిది 18 మాసాల్లో ప్రభుత్వ ప్రధాన భవనాలన్నింటినీ పూర్తి చేస్తామని కమీషనర్ చెబితే ఎలా నమ్మటం. అందులోనూ విభజన చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రదాన భవనాలంటే సచివాలయం, రాజ్ భవన్, హై కోర్టు, అసెంబ్లీ, శాసనమండలి తదితరాలు. విభజన చట్ట ప్రకారం కట్టాల్సింది కేంద్రప్రభుత్వం. అందుకు అమరావతిలో మౌళిక సదుపాయాలు కల్పించాల్సింది, భవనాల నిర్మాణాలకు అవసరమైన స్ధలాన్ని కేటాయించాల్సింది రాష్ట్రప్రభుత్వమే. ఆ పనే ఇంత వరకే జరగలేదు.

పైగా ప్రధాన భవనాలను కేంద్రం కట్టి, మిగిలిన నగరాన్ని మొత్తం ఏ సింగపూరో లేక మరేదే దేశమో కట్టటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు ఇష్టం ఉన్నట్లు లేదు. అందుకనే మొత్తం నిర్మాణాలన్నింటినీ ఏదో ప్రైవేటు సంస్ధలతో కట్టించాలని అనుకుంటున్నట్లుగా చెబుతుంటారు. అయితే, అందులో క్లారిటీ ఉండటం లేదనుకోండి. ఏదేమైనా అమరావతి నగర నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే గానీ ప్రభుత్వ ప్రధాన భవనాలకు స్ధలం కేటాయింపు సాధ్యం కాదు.

రెండున్నరేళ్ళలో మాస్టర్ ప్లానే తయారు కాలేదు. ఒకసారి అయిందని,మరోసారి చంద్రబాబుకు నచ్చలేదని వార్తలు వినబడుతున్నాయి. సింగపూర్ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ కే పలుమార్లు సవరణలు జరిగాయి. అదేవిధంగా జపాన్ సంస్ధ మాకీ అసోయేట్స్ రూపొందించిన డిజైన్లను కూడా పక్కనపడేసారు. కాకపోతే కోట్ల రూపాయలు మాత్రం చెల్లించారు.

రెండున్నరేళ్లు అయినా మాస్టర్ ప్లానే సిద్ధం కానపుడు మరో 18 మాసాల్లో ప్రభుత్వ ప్రధాన భవనాలు ఏ విధంగా సిద్దమవుతాయో సిఆర్డియేనే చెప్పాలి. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలి. కానీ జరుగుతున్నదేమిటి? ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పదు. కేంద్రం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయదు. పైగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం ఏకంగా 36వేల కోట్ల రూపాయలకు పెంచేసింది. ఒక్క ప్రాజెక్టు విషయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంతటి అవగాహన ఉన్నపుడు ఇక రాజధానిలో నిర్మించాల్సిన భవనాల గురించి చెప్పేదేముంటుంది.