భారతీయ జనతా పార్టీ ఎంఎల్సీ సోము వీర్రాజు అంతలా ఎందుకు రెచ్చిపోతున్నారో అర్దం కావటం లేదు. లేని బలాన్ని బాగా ఎక్కువగా ఊహించుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఎక్కడో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ గెలిస్తే ఇక్కడ వీర్రాజు రెచ్చిపోవటమేంటో ఆ పార్టీ నేతలకే అర్దం కావటం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు వద్దంటూ చంద్రబాబునాయుడును ప్రకటించమంటూ సవాలు చేయటం విచిత్రంగా ఉంది. పొత్తుల విషయం తేలేది ఏపిలో కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

పొత్తుల విషయంలో మొన్నటి వరకూ వెంకయ్యనాయుడే ఏకపక్షంగా నిర్ణయిచేవారు. కాబట్టి మిగిలిన నేతల పాత్ర నామమాత్రమే. కాకపోతే ఇపుడు వెంకయ్య క్రియాశీల రాజకీయాల్లో లేరు కాబట్టి వచ్చే ఎన్నికల  నాటికేమైనా పొత్తులపై ఇక్కడి నేతలతో చర్చిస్తారేమో చూడాలి.

మీడియాతో వీర్రాజు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయటానికి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటుకు జాబితాను సిద్దం చేసుకుంటున్నట్లు చెప్పారు. అంటే భాజపా ఒంటిరి పోటీకే సిద్దపడుతున్నట్లు అనుకోవాలేమో. అదే నిజమైతే, అందరిలోనూ ఓ సందేహం మొదలైంది. ఒంటరిగా పోటీ చేసే సత్తా భాజపాకు ఉందా? ఎన్నికల్లో ఒంటరిగా చాలా సార్లే పోటీ చేసినా చెప్పుకోతగ్గ సీట్లు గెలిచింది రెండు సార్లు మాత్రమే.

కార్గిల్ యుద్దంలో విజయం తర్వాత జరిగిన ఎన్నికతో పాటు ఒక్క ఓటు తేడాతో పార్లమెంటులో ఓడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలోనూ భాజపా గెలిచింది. అంతకుమించి పది సీట్లు సాధించిన ఎన్నికలు చాలా తక్కువ. వీర్రాజుకు ఈ విషయాలు తెలీకేనా అంతలా రెచ్చిపోతున్నది?

ఇక ప్రస్తుతానికి వస్తే, వచ్చే ఎన్నికల్లో నిజంగానే భాజపా ఒంటిరిగా పోటీ చేస్తే అసలు అభ్యర్ధులు దొరుకుతారా అన్నది పెద్ద ప్రశ్న. అన్నీ స్ధానాల్లోనూ పోటీ పెట్టడం వేరు, ప్రత్యర్ధులకు ధీటైన అభ్యర్ధి అనిపించుకోవటం వేరు. పోయిన ఎన్నికల్లో కలిసి పనిచేసిన కారణంగానే భాజపా-టిడిపిలు రెండు లాభపడ్డాయన్నది వాస్తవం. ‘వీర్రాజు అండ్ కో’ కోరిక ప్రకారం వచ్చే ఎన్నికల్లో భాజపా ఒంటిరిగానే పోటీ చేస్తే మిత్రపక్షాల్లో ఎవరి బలమెంత అన్నది తేలిపోతుంది.