కేంద్రమంత్రులు వస్తున్నారు, వెళుతున్నారు. వారి వల్ల ఏపికి ఒరుగుతున్నదేమీ లేదు. వచ్చిన ప్రతీ ఒక్కరూ రాష్ట్రానికి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటూ ప్రకటనలు ఇవ్వటం, రాష్ట్రానికి ఇది కావాలి, అది కావాలంటూ కేంద్రమంత్రులకు చంద్రబాబునాయుడు వినతిపత్రాలు అందచేయటం తప్ప ఇప్పటి వరకూ ఏమన్నా ఉపయోగం కనబడిందా? తాజాగా గడ్కరీ పర్యటన కూడా అందుకు మినహాయింపేమీ కాదు. దేశంలో మరే రాష్ట్రానికి ఇవ్వనంత ప్రాధాన్యత కేంద్రం ఏపికి ఇస్తోందనే సొల్లు కబుర్లు చెప్పటం తప్ప మరే ఉపయోగం లేదు. ఈ ముక్క గడచిన మూడున్నరేళ్ళుగా అనేక మంది కేంద్రమంత్రులు, కాదు కాదు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే చెప్పారు.

ఏ రాష్ట్రానికి లేని ప్రాధాన్యత కేంద్రం ఏపికి ఇస్తోందనే అనుకుందాం. విభజన చట్టంలో పేర్కొన్నట్లు రెవిన్యూ లోటు భర్తీ ఎక్కడ? ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేదు? విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఎందుకు మంజూరు చేయలేదు? రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకమైన విభజన హామీలను గాలికి వదిలేసి ఎన్ని సొల్లు కబుర్లు చెబితే మాత్రం ఉపయోగమేంటి?

ఇపుడు కూడా అదే జరిగింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన గడ్కరీ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీలించారు. తర్వాత విందు జరిగింది. పోలవరం ప్రాజెక్టు అవసరం గురించి  చంద్రబాబు వివరించారు. అంతా విన్న తర్వాత గడ్కరీ మాట్లాడుతూ, ఆ అంశం కేంద్ర జల సంఘం(సిడబ్ల్యుసి) పరిశీలనలో ఉందని చల్లగా చెప్పారు. వచ్చే వారం ఢిల్లీకి వచ్చి పని చేయించుకోవాల్సిందిగా ఓ ఉచిత సలహా కూడా పడేసారు లేండి. పోలవరం నిర్మాణంలో భాగంగా కేంద్రం నుండి రావాల్సిన రూ. 2800 కోట్లు విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పోలవరం అథారిటీ ఏమో ఇప్పటి వరకూ ఇచ్చిన నిధులకు లెక్కలు అడుగుతోంది. రాష్ట్రమేమో చెప్పటం లేదు. అందుకని నిధుల విడుదలను నిలిపి వేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇటువంటి సమయంలో నిధుల గురించి ఢిల్లీకి వచ్చి కేంద్ర జలసంఘంతో మాట్లాడమంటే అర్ధమేంటి? ఏ విషయంలోనూ గడ్కరీ కమిట్ కాలేదనే కదా? మరి, ఇంతోటి దానికి గడ్కరీ పర్యటన వల్ల రాష్ట్రానికేదో వచ్చేసిందని చెప్పుకోవటంలో అర్ధం లేదు. అసలు, ఏపికి ఏదివ్వాలన్నా ప్రధానమంత్రి ఆమోదముద్ర వేయాల్సిందే అన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు. ప్రధాని నుండి ఏ విషయంలోనూ ఆమోదముద్ర పడటం లేదని కూడా అందరికీ అర్ధమైపోతోంది. ఇంతోటి దానికి గడ్కరీని అడ్డు పెట్టుకునో లేక వెంకయ్యనాయుడిని అడ్డుపెట్టుకునో డ్రామాలు ఆడటమెందుకో?