ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి అమరావతికి వచ్చేశాడని వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఢిల్లీలో వైసీపీ వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.  

ఢిల్లీ: ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి అమరావతికి వచ్చేశాడని వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఢిల్లీలో వైసీపీ వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 

చంద్రబాబు నాయుడు నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేసి వారికి నచ్చినప్పుడు రమ్మంటే వెళ్లే చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారని ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇప్పుడు అనైతిక బంధానికి తెరదీశాడని విమర్శించారు. 

హైదరాబాద్ పదేళ్లు పాటు రాజధానిగా ఉన్నా కేవలం కేసులకు భయపడి చంద్రబాబు అమరావతికి వచ్చేశారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలకు మంచి జరిగిందేమీ లేదని దోపిడీ దారులను మాత్రం తయారు చేశారంటూ విమర్శించారు. 

 పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. తాను అక్రమంగా సంపాదించిన సొమ్మును దాచుకోనివ్వకుండా కేంద్రం అడ్డుకుందని అందువల్లే కేంద్రంపై తిరుగుబాటు ఎగురవేశారన్నారు. ఆ సొమ్ముతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని విమర్శించారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

పోలవరం ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ పనులు జరిగాయని అయితే లెఫ్ట్ కెనాల్ విషయంలో కేసులు వేయించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. 

మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపైనా సి రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నాశనమవ్వడానికి అసలు కారణం వెంకయ్యనాయుడేనని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ వెంకయ్య వ్యాఖ్యానించాడని విమర్శించారు. రాష్ట్రానికి వెంకయ్యనాయుడు ఎంత అన్యాయం చేశారో తనకు తెలుసునని చెప్పుకొచ్చారు.

ఈ వార్తలు కూడా చదువండి

చంద్రబాబు పిడేల్, గిటార్ వాయించుకోవాల్సిందే: సినీనటుడు పృథ్విరాజ్