Asianet News TeluguAsianet News Telugu

బైరెడ్డి చూపు టీడీపీ వైపు .. కూతురికి , అనుచరులకు కూడా టికెట్లు కావాలట..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీలోనే చేరాలని ఆయన డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

byreddy rajasekhar reddy May Join in TDP ksp
Author
First Published Jan 26, 2024, 3:30 PM IST | Last Updated Jan 26, 2024, 3:33 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీల్లోని సీనియర్, జూనియర్ నేతలతో పాటు కొత్త ముఖాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు తాము తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి కొందరు నేతలకు ఇవే చివరి ఎన్నికలు కావొచ్చనే మాట వినిపిస్తోంది. చివరిసారిగా పోటీ చేసి అధ్యక్షా అని అసెంబ్లీలో అనాలని నేతలు భావిస్తున్నారు. 

ఇకపోతే.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీలోనే చేరాలని ఆయన డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. నంద్యాల నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం వుందని అంటున్నారు. అలాగే తన కుమార్తె శబరికి కూడా టికెట్ ఇప్పించుకోవాలని ఆయన చూస్తున్నారు. తన కుటుంబానికి రెండు టికెట్ల ఇచ్చే అంశంపై క్లారిటీ వస్తే బైరెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమని అంటున్నారు.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి 1994, 99లో నందికొట్కూరు నుంచి ఎంఎల్ఏగా గెలుపొందారు. 2004లో ఓటమి తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయన నందికొట్కూరు నుంచి పాణ్యంకు మారారు. తదనంతర పరిణామాలతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. టీడీపీని వీడి ప్రత్యేకంగా రాయలసీమ హక్కులంటూ పోరాటానికి దిగారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలలో కొన్నాళ్లు గడిపి టీడీపీలో చేరారు.

మధ్యలో వైసీపీలో చేరాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ చట్టసభల్లో అడుగుపెట్టాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో ఆయన మంతనాలు జరిపినట్లుగా ప్రచారం జరిగింది. నంద్యాల లోక్‌సభతో పాటు నందికొట్కూరు, పాణ్యం అసెంబ్లీ టికెట్లు తనవాళ్లకు ఇవ్వాలని బైరెడ్డి పట్టుబడుతున్నారు. 

అయితే బైరెడ్డి టీడీపీలో చేరినా.. టికెట్లు అంత తేలిగ్గా దొరుకుతాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా వున్న మాండ్ర శివానందరెడ్డి, పాణ్యం, నందికొట్కూరు ఇన్‌ఛార్జ్‌లు గౌరు వెంకట్రెడ్డి, గౌరు చరితా రెడ్డిలను కాదని బైరెడ్డికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది తెలియాల్సి వుంది. ఇదే సమయంలో చరితారెడ్డికి ఎంఎల్సీ, మాండ్రకు రాజ్యసభ టికెట్లు ఇచ్చి.. బైరెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారట. అంతా కలిసి పనిచేసి నంద్యాల ఎంపీ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనూ గెలవాలని తమ్ముళ్లకు టీడీపీ బాస్ సూచించారట. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios